PM Modi: 50ఏళ్ల క్రితం నాటి పొరబాటు మళ్లీ జరగొద్దు: ‘ఎమర్జెన్సీ’పై మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi: దేశ చర్రితలో ఎమర్జెన్సీ పరిస్థితి ఓ మచ్చలా మిగిలిపోయిందని ప్రధాని మోదీ అన్నారు. నాటి పొరబాటు మళ్లీ జరగొద్దని ఆకాంక్షించారు.

Updated : 24 Jun 2024 13:01 IST

దిల్లీ: 18వ లోక్‌సభ (18th Lok Sabha) తొలి సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీడియాతో మాట్లాడారు. ఇదో అద్భుతమైన రోజు అంటూ కొత్తగా ఎన్నికైన సభ్యులకు స్వాగతం పలికారు. సభ్యులందరినీ కలుపుకొని వికసిత భారత్‌ లక్ష్యాన్ని చేరుకుంటామని విశ్వాసం వ్యక్తంచేశారు.

ఈ ఉదయం పార్లమెంట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ (Narendra Modi)కి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రజాస్వామ్య పార్లమెంటరీ చరిత్రలో ఇదో అద్భుతమైన రోజు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా లోక్‌సభ ఎంపీల ప్రమాణస్వీకారం మన కొత్త పార్లమెంట్‌ (Parliament) భవనంలో జరగనుంది. ఈ శుభ సమయాన కొత్తగా ఎన్నికైన సభ్యుల (Elected Candidates)కు స్వాగతాభినందనలు తెలియజేస్తున్నా. ప్రజలు మా విధానాలను విశ్వసించారు. దేశానికి మూడోసారి సేవ చేసే భాగ్యాన్ని ప్రజలు కల్పించారు. సరికొత్త విశ్వాసంతో నేడు కొత్త సమావేశాలు ప్రారంభిస్తున్నాం. రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటాం. ప్రజల స్వప్నం నెరవేర్చే సంకల్పం తీసుకున్నాం. సభ్యులందరినీ కలుపుకొని 2047 వికసిత భారత్‌ సంకల్పం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా సాగుతాం. కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని మనమంతా ముందుకెళ్దాం’’ అని ఎంపీలకు పిలుపునిచ్చారు.

ఎమర్జెన్సీ ఓ మచ్చ..

‘‘అత్యయిక స్థితి ఏర్పడి రేపటికి 50 ఏళ్లు పూర్తవుతాయి. దేశ ప్రజాస్వామ్య చర్రితలో ఎమర్జెన్సీ ఓ మచ్చలా మిగిలిపోయింది. 50ఏళ్ల క్రితం జరిగిన పొరపాటు పునరావృతం కాకూడదు’’ అని మోదీ (PM Modi) అన్నారు. ఈ సందర్భంగా విపక్ష ఎంపీలకు చురకలంటించారు. ‘‘ఈ దేశానికి మంచి, బాధ్యతాయుతమైన విపక్షం అవసరం. ప్రజాస్వామ్య మర్యాదను కాపాడేలా, సామాన్య పౌరుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతిపక్షాలు నడుచుకుంటాయని ఆశిస్తున్నా. డ్రామాలు, ఆటంకాలను ప్రజలు కోరుకోవట్లేదు. నినాదాలు ఆశించట్లేదు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు విపక్షాలు కూడా సహకరించాలి’’ అని ప్రధాని హితవు పలికారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని