PM Modi: యోగాతో ప్రపంచ శ్రేయస్సు!

యోగాను అంతర్జాతీయ శ్రేయస్సు సాధకంగా ప్రపంచం చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యోగా సాధనను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Published : 22 Jun 2024 05:59 IST

దైనందిన జీవితంలో దాన్ని భాగం చేసుకోవాలి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు

శ్రీనగర్, దిల్లీ: యోగాను అంతర్జాతీయ శ్రేయస్సు సాధకంగా ప్రపంచం చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యోగా సాధనను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. దానివల్ల వ్యక్తిత్వ, సమాజ వికాసం సాకారమవుతుందని చెప్పారు. పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జమ్మూకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో డాల్‌ సరస్సు ఒడ్డున షేర్‌-ఎ-కశ్మీర్‌ అంతర్జాతీయ సమావేశ కేంద్రం (ఎస్‌కేఐసీసీ)లో శుక్రవారం ప్రధాని స్వయంగా ఆసనాలు వేశారు. యోగా అనేది జ్ఞానం మాత్రమే కాదని, అదొక విజ్ఞాన శాస్త్రం కూడా అని వ్యాఖ్యానించారు. విద్యార్థులు, ఔత్సాహికులతో కలిసి మైదానంలో యోగాసనాలు వేయాలని మోదీ భావించినా.. వర్షం కారణంగా కార్యక్రమాన్ని ఎస్‌కేఐసీసీ లోపలే నిర్వహించాల్సి వచ్చింది. వర్షాన్ని లెక్కచేయకుండా భారీ సంఖ్యలో ప్రజలు కార్యక్రమానికి తరలివచ్చారు. మోదీతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. 

ప్రశాంతత కోసం.. 

‘‘యోగాను చాలామంది.. దేవుడిని అన్వేషించే ఆధ్యాత్మిక ప్రయాణంగా భావిస్తుంటారు. ఆధ్యాత్మికత సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందుగా వ్యక్తిత్వ వికాసంపై దృష్టిపెడదాం. దాని సాధనకు, వర్తమానంలో ప్రశాంతతకు యోగా దోహదపడుతుంది. వ్యక్తిత్వ వికాసంతో సమాజం అభివృద్ధి చెందుతుంది. దానివల్ల సమస్త మానవాళి లాభపడుతుంది. యోగాతో దీర్ఘకాలంపాటు బోలెడు ప్రయోజనాలు ఉంటాయి’’ అని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. యోగాలోని ప్రత్యేక టెక్నిక్‌లతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలను పెంచుకోవచ్చని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా యోగా సాధకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని మోదీ అన్నారు. 

పర్యాటకానికి ఊతం 

యోగా గురించి పూర్తిగా తెలుసుకునేందుకు భారత్‌లో పర్యటిస్తున్న విదేశీయుల సంఖ్య పెరుగుతోందని మోదీ చెప్పారు. ఉత్తరాఖండ్, కేరళ వంటి రాష్ట్రాల్లో ‘యోగా పర్యాటకం’ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోనూ పర్యాటకరంగ అభివృద్ధికి యోగా దోహదపడుతుందని, దానివల్ల జీవనోపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.  ‘‘చాలామంది ఫిట్‌నెస్‌ కోసం వ్యక్తిగత యోగా శిక్షకులను నియమించుకుంటున్నారు. ఉద్యోగుల మానసిక, శారీరక దృఢత్వ పెంపు కార్యక్రమాల్లో కంపెనీలు యోగాను భాగంగా చేస్తున్నాయి. ఫలితంగా జీవనోపాధికి అదొక మార్గంగా మారింది’’ అని మోదీ పేర్కొన్నారు. అనేక సమస్యలకు యోగా పరిష్కార మార్గాలు చూపుతుందని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని