కల్యాణ్‌ జీ.. మీకోసం దేశ ప్రజలు ప్రార్థిస్తున్నారు

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్సపొందుతున్న భాజపా సీనియర్‌ నేత, యూపీ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రార్థించారు. .....

Updated : 09 Jul 2021 18:26 IST

దిల్లీ: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న భాజపా సీనియర్‌ నేత, యూపీ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రార్థించారు. లఖ్‌నవూలోని ఓ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న కల్యాణ్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల ఆయన మనుమడితో ఫోన్‌లో మాట్లాడి తెలుసుకున్నట్టు ప్రధాని ట్విటర్‌లో వెల్లడించారు.  దేశవ్యాప్తంగా అసంఖ్యాక ప్రజలు కల్యాణ్‌ సింగ్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు. నిన్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తదితర నేతలు ఆస్పత్రికి వెళ్లి ఆయన్ను కలిసినట్టు ప్రధాని తెలిపారు. తాను ఆయన మనుమడికి ఫోన్‌చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్టు పేర్కొన్నారు.  జేపీ నడ్డాజీతో సంభాషణలో కళ్యాణ్ సింగ్‌ తనను జ్ఞాపకం చేసుకున్నారని తెలుసుకోవడం తననెంతో హత్తుకుందన్నారు. ఆయనతో తనకు అనేక జ్ఞాపకాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. కల్యాణ్‌సింగ్‌తో మాట్లాడుతుంటే ఎల్లప్పుడూ ఏదో ఒక విషయం నేర్చుకున్న అనుభవమే తనకు ఉందని ప్రధాని పేర్కొన్నారు.

మరోవైపు, రాజస్థాన్‌ గవర్నర్‌గానూ పనిచేసిన 89 ఏళ్ల కల్యాణ్ సింగ్ అనారోగ్యంతో లఖ్‌నవూలోని సంజయ్‌ గాంధీ పీజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఆదివారం చేరారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని, ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టు ఈ రోజు ఉదయం వైద్యులు ప్రకటనలో తెలిపారు. నెఫ్రాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, ఎండోక్రైనాలజీకి చెందిన వైద్య నిపుణుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.

గురువారం కల్యాణ్‌సింగ్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొనేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఆస్పత్రికి వెళ్లినట్టు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్‌ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. కల్యాణ్‌సింగ్‌ ఆరోగ్యంపై ప్రధాని ఆందోళన చెందడంతో తాను లఖ్‌నవూ వెళ్లి.. సీఎం యోగి, ఇతర నేతలతో కలిసి ఆస్పత్రికి వెళ్లినట్టు తెలిపారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని