UP Polls: ఆ పార్టీలకు ఉగ్రవాదులపై సానుభూతి: మోదీ

ఉగ్రవాదులపై నమోదు చేసిన కేసులను వెనక్కి తీసుకుంటూ కొన్ని రాజకీయ పార్టీలు వారిపై సానుభూతి చూపిస్తున్నాయంటూ సమాజ్‌వాదీ పార్టీ ఉద్దేశిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు.

Published : 20 Feb 2022 23:51 IST

కాంగ్రెస్‌, సమాజ్‌వాదీలపై నిప్పులు చెరిగిన ప్రధానమంత్రి

హర్దోయ్‌: ఉగ్రవాదులపై నమోదు చేసిన కేసులను వెనక్కి తీసుకుంటూ కొన్ని రాజకీయ పార్టీలు వారిపై సానుభూతి చూపిస్తున్నాయంటూ సమాజ్‌వాదీ పార్టీ ఉద్దేశిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో గతంలో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, ఉగ్రదాడుల్లో ప్రమేయం ఉన్న వారిపై కేసులను వెనక్కి తీసుకోవడం దారుణమన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని హర్దోయ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. ‘కట్టా(నాటు తుపాకులు)’ ఉపయోగించే వారికి సమాజ్‌వాదీ పార్టీ అప్పట్లో పూర్తి స్వేచ్ఛను కల్పించిందని ఆరోపించారు. వాటితోనే రాష్ట్రంలో రౌడీయిజం మరింత పెరిగిపోయిందని అన్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌ వరుస పేలుళ్ల ఘటనను ప్రధాని మోదీ గుర్తుచేశారు.

‘2008లో అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి. అందులో 56 మంది చనిపోవడంతోపాటు 200లకుపైగా అమాయక ప్రజలు తీవ్ర గాయాలపాలయ్యారు. అయినప్పటికీ అటువంటి ఉగ్రవాదులకు కొన్ని పార్టీలు సానుభూతి ప్రకటిస్తుంటాయి. చాలా మంది ఉగ్రవాదులపై ఉన్న కేసులను ఉపసంహరించుకునేందుకు అప్పటి సమాజ్‌వాదీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది’ అని గతంలో అఖిలేశ్‌ ప్రభుత్వం తీరును ప్రధాని మోదీ ఎండగట్టారు. వీటికితోడు కొన్ని పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తాయంటూ విమర్శించిన మోదీ.. అందులో భాగంగానే పండగలను కూడా జరుపుకోకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అలాంటివారికి మార్చి 10న ఫలితమేంటో తెలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఇక 2008లో చోటుచేసుకున్న అహ్మదాబాద్‌ వరుస పేలుళ్ల ఘటనలో 38మందికి మరణశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఇటీవలే తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అందులో ఒక ఉగ్రవాది యూపీలోని ఆజంగఢ్‌కు చెందిన వాడేనని యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా మరో ఉగ్రవాది తండ్రికి సమాజ్‌వాదీతో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు చేశారు. ఇదే విషయమై పేలుళ్లకు కారణమైన ఓ ఉగ్రవాది తండ్రి ఎస్‌పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి దిగిన ఫొటోను కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ విడుదల చేశారు.

ఇదిలాఉంటే, ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 20నాటికి మూడు దశలు పూర్తయ్యాయి. ఈ నెల 23న నాలుగో దశ పోలింగ్‌ జరుగనుంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని