PM KISAN: అప్పుడు బడ్జెట్‌ రూ.25 వేల కోట్లు.. ఇప్పుడు రూ.1.25 లక్షల కోట్లు: మోదీ

అర్హులైన  రైతులకు ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా రూ.16,000 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. కర్ణాటకలోని బెళగావిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన.. నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేశారు.

Published : 27 Feb 2023 20:22 IST

బెళగావి: చిన్న, సన్నకారు రైతుల అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రధాని మోదీ అన్నారు. మోదీ ప్రభుత్వంలో ప్రతిపైసా ప్రజలదేనని, వారి కోసమే ఖర్చు చేస్తామని చెప్పారు. 2014లో భాజపా తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వ్యవసాయం కోసం రూ.25 వేల కోట్లు కేటాయించామన్న మోదీ.. ప్రస్తుతం అది రూ. 1.25 లక్షల కోట్లకు చేరుకుందని తెలిపారు.  దేశ వ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది రైతులకు ‘ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ (PM KISAN) 13వ విడత కింద రూ.16,000 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రధాని మోదీ (PM Modi) విడుదల చేశారు. కర్ణాటక (Karnataka)లో పర్యటిస్తున్న ఆయన.. బెళగావి (Belagavi) జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పీఎం కిసాన్‌ నిధులను విడుదల చేశారు. వాతావరణ మార్పుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కోగల సత్తా తృణధాన్యాలకు ఉంటుందన్న మోదీ.. అందుకే వాటిని ‘ సూపర్‌ ఫుడ్‌ ’ అంటారని తెలిపారు . కేంద్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి ఎంత మేర దోహదం చేస్తుందనే విషయం ప్రతిఏటా వ్యవసాయం కోసం కేటాయిస్తున్న బడ్జెట్‌ను చూస్తే అర్థమవుతుందని చెప్పారు. 

పీఎం కిసాన్‌  పథకం కింద అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఏడాదికి రూ.6000 ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పటి వరకు  11 కోట్ల మంది రైతులకు రూ.2.25 లక్షల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ సందర్భంగా నూతనంగా అభివృద్ధి చేసిన బెళగావి రైల్వే స్టేషన్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ప్రయాణికులకు అత్యున్నత సౌకర్యాలు కల్పించేలా దాదాపు రూ.190 కోట్లతో రైల్వేస్టేషన్‌ నవీకరించారు. అంతేకాకుండా లొండా-బెళగావి-ఘటప్రభ మధ్య ఏర్పాటు చేసిన రైల్వే డబుల్‌ లైన్‌ను కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు. రూ.930 కోట్లతో ఈ అభివృద్ధి పనులు చేపట్టారు. దాదాపు రూ.1,585 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఆరు బహుళ గ్రామీణాభివృధ్ధి పథకాలకు మోదీ శంకుస్థాపన చేశారు. తద్వారా 315 గ్రామాల్లోని 8.8 లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరనుంది.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమార్‌, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తదితరులు పాల్గొన్నారు. మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ కర్ణాటకలో మోదీ సుడిగాలి పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. పీఎం కిసాన్‌ నిధులను విడుదల చేయకముందు గ్రీన్‌ఫీల్డ్‌ శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. బెళగావి చేరుకునే మార్గంలో మాలిని నగరం నుంచి దాదాపు 10.5 కి.మీ మేర మోదీ రోడ్‌ షో చేపట్టారు. రోడ్డుకి ఇరువైపులా నిల్చున్న ప్రజలకు అభివాదాలు తెలుపుతూ ముందుకు సాగారు. దాదాపు లక్ష మంది మహిళలు కాషాయ వస్త్రాలు ధరించి మోదీకి స్వగతం పలికారు.‘ మోదీ.. మోదీ’ అంటూ నినాదాలు చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని