PM Modi: మీకు వచ్చింది 99/100 కాదు.. 99/543: కాంగ్రెస్‌పై మోదీ సెటైర్లు

PM Modi: ఎన్ని అబద్ధాలు చెప్పినా విపక్షాలకు మళ్లీ ఘోర ఓటమి తప్పలేదని ప్రధాని మోదీ విమర్శించారు. వారి బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. 99 సీట్లకే కాంగ్రెస్‌ మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకుంటోందన్నారు.

Updated : 02 Jul 2024 17:23 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలంతా పరిపక్వతతో తీర్పునిచ్చారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) అన్నారు. వరుసగా మూడోసారి తాము అధికారంలోకి రావడంతో కొందరు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని కాంగ్రెస్‌కు పరోక్షంగా చురకలంటించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ మంగళవారం లోక్‌సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల (Opposition)కు మళ్లీ ఘోర ఓటమి తప్పలేదని.. వారి బాధను అర్థం చేసుకోగలనని ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీపై మోదీ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ‘‘కాంగ్రెస్‌ (Congress) ప్రతిపక్షంలోనే కూర్చోవాలని ప్రజలు మరోసారి తీర్పునిచ్చారు. వరుసగా మూడు సార్లు ఆ పార్టీ 100 మార్క్‌ దాటలేదు. ఇన్నిసార్లు ఓడినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రతిపక్ష నేతలకు అర్థం కావట్లేదు. 99 సీట్లు వచ్చాయని కాంగ్రెస్‌ నేతలు మిఠాయిలు పంచుకుంటున్నారు. కాంగ్రెస్‌కు వందకు 99 సీట్లు రాలేదు. 543లో 99 వచ్చాయి. వారి స్ట్రైక్‌ రేట్‌ 26శాతం మాత్రమే. ప్రజా తీర్పును వారు ఇకనైనా గౌరవించాలి’’ మోదీ దుయ్యబట్టారు. 

‘‘వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా రాష్ట్రపతి మార్గదర్శనం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై పలువురు సభ్యులు అభిప్రాయాలు చెప్పారు. సభ గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే. పదేళ్లలో అవినీతిరహిత పాలన అందించాం. అది చూసే ప్రజలు మరోసారి మాకు అవకాశమిచ్చారు. గత పదేళ్లలో ప్రపంచ దేశాల్లో దేశ ప్రతిష్ఠ మరింత పెరిగింది. ఇవాళ ప్రపంచమంతా మనవైపు చూస్తోంది. భారత్‌ ప్రథమ్‌ అనే మా విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. ఏ కార్యక్రమం చేపట్టినా భారత్‌ ప్రథమ్‌ కేంద్రంగానే తీసుకుంటున్నాం. మా పథకాలన్నీ అట్టడుగు వర్గాలకు చేరాలనేదే మా విధానం’’ అని ప్రధాని (Narendra Modi) తెలిపారు.

అప్పుడు ప్రతి రోజు కుంభకోణాల వార్తలే..

‘‘దేశంలో కొన్ని దశాబ్దాల పాటు బుజ్జగింపు రాజకీయాలు కొనసాగాయి. దాంతో దేశం తీవ్రంగా నష్టపోయింది. 2014లో దేశం నిరాశ, నిస్పృహలో కూరుకుపోయింది. ప్రజలంతా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయారు. ఆ సమయంలో ప్రతి సామాన్యుడి నోట ఒకటే మాట వినబడేది.. ‘ఈ దేశంలో మార్పు రాదా?’ అని..! అప్పుడు ఏ పేపర్‌ చూసినా కుంభకోణాల వార్తలే కన్పించేవి. గత ప్రభుత్వాల పాలనలో రూపాయిలో యాభై పైసలు అవినీతి జరిగేది. గతంలో గ్యాస్‌ కనెక్షన్ల కోసం ఎంపీల చుట్టూ తిరగాల్సిన పని ఉండేది. రేషన్‌ బియ్యం దొరకడం కష్టంగా ఉండేది. వీటన్నిటితో ప్రజలు విసుగెత్తిపోయారు. మమ్మల్ని ఎన్నుకున్న తర్వాతే మార్పు మొదలైంది. ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అని ప్రధాని తెలిపారు.

రాజ్యాంగం నెత్తిన పెట్టుకుని..

‘‘2014కు ముందు దేశంలోకి ఉగ్రవాదులు చొరబడి దేశంలో ఎక్కడపడితే అక్కడ దాడులు చేసేవారు. మేం వచ్చాకే ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాం. సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేశాం. రాజ్యాంగాన్ని తలపై పెట్టుకుని చిందులేస్తున్న వారు.. జమ్ముకశ్మీర్‌లో దాన్ని అమలు చేయలేక.. అంబేడ్కర్‌ను అవమానించారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని తొలగించాకే అక్కడ శాంతిభద్రతలు మెరుగయ్యాయి. అక్కడ రాళ్ల దాడులు తగ్గాయి. గతంలో దోషులు చట్టం నుంచి తప్పించుకునేవారు. 2014 తర్వాత దోషుల ఇళ్ల వద్ద కూడా బుల్లెట్ల వర్షం కురిసింది. మేం వచ్చాకే తుప్పుపట్టిన చట్టాలను రద్దు చేశాం.’’ అని మోదీ గుర్తుచేశారు.

ప్రధాని ప్రసంగంలో ఏపీ ప్రస్తావన.. 

ఈ సందర్భంగా ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా ప్రధాని ప్రస్తావించారు. ‘‘లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో మా కూటమి క్వీన్‌ స్వీప్‌ చేసింది. ఒడిశాలో జగన్నాథుడి ఆశీస్సులతో ప్రభుత్వం ఏర్పాటు చేశాం. అనేక రాష్ట్రాలు భాజపా పాలనను కోరుకుంటున్నాయి’’ అని మోదీ తెలిపారు.

విపక్షాల ఆందోళన.. స్పీకర్‌ సీరియస్‌

ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా విపక్షాలు ఆందోళనకు దిగాయి. నీట్‌ పేపర్‌ లీకేజ్‌, మణిపుర్‌ అంశాలపై చర్చించాలని డిమాండ్‌ చేస్తూ గట్టిగట్టిగా నినాదాలు చేశాయి. దీంతో స్పీకర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకోవడం సబబు కాదన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. సభను తప్పుదోవ పట్టించొద్దని అన్నారు. అయినప్పటికీ వారు వినిపించుకోలేదు. ప్రధాని మాట్లాడుతున్నంత సేపు ‘మణిపుర్‌.. మణిపుర్‌’ అంటూ నినాదాలు చేశారు. వారి నిరసన మధ్యే ప్రధాని ప్రసంగాన్ని కొనసాగించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని