PM Modi: పూర్తి స్థాయిలో బలగాలను వినియోగించండి

వరుస దాడుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద నిర్మూలనకు పూర్తిస్థాయి శక్తిసామర్థ్యాలతో బలగాలను వినియోగించాలని ప్రధాని నరేంద్రమోదీ ఆదేశించారు.

Updated : 14 Jun 2024 06:11 IST

 కశ్మీర్‌ ఉగ్రవాదంపై సమీక్షలో మోదీ

దిల్లీ, జమ్మూ: వరుస దాడుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద నిర్మూలనకు పూర్తిస్థాయి శక్తిసామర్థ్యాలతో బలగాలను వినియోగించాలని ప్రధాని నరేంద్రమోదీ ఆదేశించారు. అక్కడి పరిస్థితులు, ఇటీవల బస్సుపై ఉగ్రదాడి గురించి గురువారం ఆయన ఉన్నతస్థాయిలో సమీక్ష నిర్వహించారు. బలగాల మోహరింపు తీరుపై జాతీయ భద్రత సలహాదారుడు అజీత్‌ డోభాల్, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలతో కూడా ఆయన చర్చించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా నుంచి వివరాలు తెలుసుకున్నారు. 

నిర్బంధంలో 50 మంది 

వైష్ణోదేవి మాత ఆలయానికి వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఇటీవలి ఉగ్రదాడి ఘటనకు సంబంధించి 50 మందిని నిర్బంధంలో తీసుకోవడంతోపాటు రియాసి జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోనూ అన్వేషణ సాగిస్తున్నట్లు భద్రత బలగాలు తెలిపాయి. నార్వాల్‌ బైపాస్‌ ప్రాంతంలో ఇద్దరు అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో సోదాలు నిర్వహించారు. దాడులకు పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను పోలీసులు విడుదల చేశారు. వారి సమాచారం తెలిపిన వారికి రూ.20 లక్షల బహుమతి ప్రకటించారు. కఠువా, సాంబా, జమ్మూ జిల్లాల్లో కూడా ఉగ్ర ముప్పు పొంచిఉందన్న సమాచారంతో బలగాలను అప్రమత్తం చేశారు. 

కశ్మీర్‌ బడుల్లో జాతీయగీతం తప్పనిసరి 

శ్రీనగర్‌: ఐక్యత, క్రమశిక్షణ పాదుకొల్పడానికి ఉపయోగపడేలా పాఠశాలల్లో రోజూ ఉదయాన్నే విద్యార్థులంతా అసెంబ్లీ అయినప్పుడు ముందుగా జాతీయగీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలని జమ్మూకశ్మీర్‌ విద్యాశాఖ అన్ని పాఠశాలలకు ఆదేశాలిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని