PM modi:ఒమిక్రాన్‌తో జాగ్రత్త.. టెస్ట్‌లు పెంచండి:మోదీ

దేశంలో కరోనా పరిస్థితి, ఆరోగ్య వ్యవస్థల సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతనక జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి ......

Updated : 23 Dec 2021 22:38 IST

దిల్లీ: దేశంలో కరోనా పరిస్థితి, ఆరోగ్య వ్యవస్థల సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి ప్రధాని కీలక సూచనలు చేశారు. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. పరిస్థితిని అదుపు చేయడంలో చురుగ్గా పనిచేయాలని, సత్వర చర్యలు చేపట్టాలన్నారు. కొవిడ్‌ టెస్ట్‌లను పెంచడంతో పాటు వైరస్‌ బారిన పడినవారితో కాంటాక్టు అయినవారిని ట్రేసింగ్‌ చేయడంలో వేగంగా పనిచేయాలన్నారు.

అలాగే, వ్యాక్సినేషన్‌ను మరింత ముమ్మరం చేయాలని, ఆరోగ్య మౌలిక వసతులను మరింతగా బలోపేతం చేసుకోవాలని రాష్ట్రాలకు మోదీ సూచించారు. అత్యధిక కేసులు నమోదవుతున్న, వ్యాక్సినేషన్‌ తక్కువగా ఉన్న, ఆరోగ్య వసతులు తగినవిధంగా లేని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సహకరించేలా కేంద్ర బృందాలను పంపాలని ఆదేశించారు. కొవిడ్‌కు వ్యతిరేకంగా అందరూ సమన్వయంతో, పరస్పర సహకారంతో సమర్థంగా పనిచేయాలన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 88 శాతం అర్హులైన జనాభాకు కొవిడ్‌ తొలి డోసు టీకా పంపిణీ చేయగా.. 60 శాతానికి పైగా జనాభాకు రెండో డోసు పూర్తి చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.

అలాగే, కొవిడ్‌పై పోరులో టెలీమెడిసిన్‌, టెలీ కన్సల్టేషన్‌తో పాటు సాంకేతిక వ్యవస్థను సమర్థంగా వాడుకోవాలని మోదీ సూచించారు. ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు వీలుగా పరికరాలను ఇన్‌స్టాల్‌ చేసుకొని పూర్తిస్థాయిలో పనిచేసేలా సిద్ధం చేసుకోవాలని సూచించారు. కరోనాపై యుద్ధం ముగిసిపోలేదన్న ప్రధాని.. కొవిడ్‌ నుంచి రక్షణ పొందేందుకు నిరంతర చర్యలు నేటికీ అవసరమన్నారు. అర్హులైన ప్రజలందరికీ పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని రాష్ట్రాలకు మరోసారి గుర్తుచేశారు.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని