PM Modi: చరిత్ర సృష్టించిన ప్రజల తీర్పు

దేశంలోని 9.26 కోట్ల రైతులకు ఆదాయ మద్దతు పథకంలో భాగంగా మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.20 వేల కోట్లను విడుదల చేశారు.

Updated : 19 Jun 2024 06:15 IST

వారణాసి పర్యటనలో ప్రధాని మోదీ
రైతులకు రూ.20 వేల కోట్ల కిసాన్‌ సమ్మాన్‌ నిధుల విడుదల 

వారణాసి, దిల్లీ : దేశంలోని 9.26 కోట్ల రైతులకు ఆదాయ మద్దతు పథకంలో భాగంగా మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.20 వేల కోట్లను విడుదల చేశారు. వారణాసిలో జరిగిన పీఎం కిసాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌ కార్యక్రమంలో ఈ విడుదల జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలిచ్చిన అపూర్వ తీర్పు చరిత్ర సృష్టించిందన్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో ఓ ప్రభుత్వాన్ని మూడో దఫా ఎన్నుకోవడం అత్యంత అరుదైన విషయమైనా దేశ ప్రజలు దాన్ని ఆవిష్కరించారని పేర్కొన్నారు. తమ కొత్త ప్రభుత్వం రైతులు, పేదలకు ప్రయోజనం కలిగించే అంశంపైనే తొలి నిర్ణయం తీసుకుందన్నారు. ప్రపంచంలో మనదేశం మూడో ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు వ్యవసాయరంగం ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు. కాశీ విశ్వనాథుడు, గంగా మాత ఆశీర్వాదం; వారణాసి ప్రజల ప్రేమాభిమానాలతోనే తాను దేశానికి మూడోసారి ‘ప్రధాన్‌ సేవక్‌’గా ఎన్నికయ్యానని మోదీ తెలిపారు. ఇదంతా చూస్తుంటే గంగా మాత తనను దత్తత తీసుకున్నట్లుగా ఉందన్నారు. వారణాసి ప్రజలు తనను మూడోసారి ఎంపీగానే కాకుండా ప్రధానిగా కూడా ఎంపిక చేసుకున్నారన్నారు. అనంతరం దశాశ్వమేధఘాట్‌లో జరిగిన గంగాహారతిలో పాల్గొన్నారు. ఆపై కాశీవిశ్వనాథ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.  

30 నుంచి మన్‌ కీ బాత్‌ పునఃప్రారంభం

ప్రతి నెలా రేడియో ద్వారా నిర్వహించే ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమాన్ని ఈ నెల 30 నుంచి పునఃప్రారంభించనున్నామని ప్రధాని  మోదీ మంగళవారం ‘ఎక్స్‌’లో వెల్లడించారు. ఈ కార్యక్రమంపై ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలను ఎంవైజీవోవీ ఓపెన్‌ ఫోరం, నమో యాప్‌ ద్వారా తెలపాలని కోరారు. లేదా 1800 11 7800 నంబర్‌కు సందేశం పంపొచ్చన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని