Jammu Kashmir: ఆ రోజు ఎంతో దూరంలో లేదు

జమ్మూ-కశ్మీర్‌ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయని ప్రధాని  మోదీ తెలిపారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రజలు తమ సొంత ప్రభుత్వాన్ని ఎన్నుకునే, రాష్ట్ర హోదా తిరిగి పొందే రోజు ఎంతో దూరంలో లేదని స్పష్టంచేశారు.

Published : 21 Jun 2024 05:58 IST

జమ్మూకశ్మీర్‌ శాసనసభ ఎన్నికలపై ప్రధాని మోదీ 
నేడు డాల్‌ సరస్సు ఒడ్డున యోగా దినోత్సవానికి హాజరు

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయని ప్రధాని  మోదీ తెలిపారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రజలు తమ సొంత ప్రభుత్వాన్ని ఎన్నుకునే, రాష్ట్ర హోదా తిరిగి పొందే రోజు ఎంతో దూరంలో లేదని స్పష్టంచేశారు. రెండు రోజుల జమ్మూ-కశ్మీర్‌ పర్యటన నిమిత్తం మోదీ గురువారం శ్రీనగర్‌ చేరుకున్నారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన జమ్మూ-కశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.  పర్యటనలో భాగంగా ఆయన రూ.1,500 కోట్ల విలువైన 84 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో పోలింగ్‌ను నమోదుచేస్తూ గత 35 సంవత్సరాల రికార్డును తిరగరాయడంపై జమ్మూ-కశ్మీర్‌ ప్రజలను అభినందించిన ఆయన.. ‘మీరు మీ ఓటుతో మీ సొంత ప్రజాప్రతినిధిని ఎన్నుకునే రోజు’ ఎంతో దూరంలో లేదని వ్యాఖ్యానించారు. జమ్మూ-కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను సైతం పునరుద్ధరిస్తామని, ఇందుకు సంబంధించి ప్రణాళికలను రూపొందిస్తున్నామని చెప్పారు. జమ్మూలో ఇటీవలి ఉగ్రదాడులను ప్రస్తావిస్తూ.. ముష్కరులకు తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. ‘‘ఇటీవలి ఉగ్రదాడులను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. మొత్తం యంత్రాంగంతో కేంద్ర హోం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. శత్రువులను శిక్షించడానికి మేం ఏ ఒక్క అవకాశాన్నీ విడిచిపెట్టబోం’’ అని మోదీ చెప్పారు.  

పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లోని డాల్‌ సరస్సు ఒడ్డునున్న షేర్‌-ఏ-కశ్మీర్‌ అంతర్జాతీయ సమావేశ కేంద్రం వద్ద శుక్రవారం ఉదయం 6.30 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని