Subramanian Swamy: అదానీ గ్రూపు ఆస్తులన్నీ జాతీయం చేసి.. వేలం వేయాలి..!

అదానీ గ్రూపు (Adani Group)పై వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో ఆ ఆస్తులన్నీ జాతీయం చేయాలని కోరుకుంటున్నట్లు భాజపా సీనియర్‌ నేత సుబ్రహ్మణ్యస్వామి  (Subramanian Swamy) పేర్కొన్నారు.

Updated : 08 Feb 2023 15:31 IST

చెన్నై: అమెరికా పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికతో అదానీ గ్రూపు (Adani Group) షేర్లు తీవ్ర ఒడుదొడుకులకు గురయ్యాయి. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేయాలని అటు పార్లమెంటులోనూ విపక్ష పార్టీలు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఈ క్రమంలో అదానీ వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూపు ఆస్తులను కేంద్ర ప్రభుత్వం జాతీయం చేసి.. వాటిని వేలం వేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తాజాగా పీటీఐ వార్త సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. అదానీ వ్యవహారం, కేంద్ర బడ్జెట్‌, ముషారఫ్‌ మరణంపై సానుభూతి వంటి అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

అదానీ అస్తులు అమ్మాలని..

‘అదానీ గ్రూపు ఆస్తులన్నీ జాతీయం చేసి వాటిని వేలం వేయాలి. వచ్చిన నగదును ఇందులో నష్టపోయిన వారికి సహాయంగా అందజేయాలి. అదానీతో ఒప్పందాలు లేవని కాంగ్రెస్‌ చెబుతోంది.  కానీ, అందులో అదానీతో ఒప్పందాలు ఉన్న వ్యక్తుల గురించి నాకు తెలుసు. అయినా కాంగ్రెస్‌ను పట్టించుకోను. భాజపా పవిత్రతను నిరూపించుకోవాలని కోరుకుంటున్నా. ప్రధాని మోదీ ఏదో దాచిపెడుతున్నారని ప్రజల్లో ఒక భావన ఉంది. దానిపై స్పష్టతనిచ్చే బాధ్యత ప్రభుత్వానిదే’ అని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు.

ముషారఫ్‌పై సానుభూతి..

‘పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మరణంపై సానుభూతి వ్యక్తం చేయడం పట్ల ఎన్నో విమర్శలు వచ్చాయి. కార్గిల్‌ యుద్ధానికి కారణమైన వ్యక్తి గురించి అలా ఎలా మాట్లాడుతారని ప్రశ్నిస్తున్నారు. కార్గిల్‌ యుద్ధం జరిగే సమయంలో (1999) పాకిస్థాన్‌ ప్రధానిగా నవాజ్‌ షరీఫ్‌ ఉన్నారు. ఆయన ఆదేశాల మేరకు సైనికాధిపతిగా ఉన్న ముషారఫ్‌ తన సైనికులకు ఆదేశాలిచ్చారు. అయితే, నిబంధనలను పక్కనబెట్టి పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. నవాజ్‌ షరీఫ్‌తో కలిసి భోజనం చేశారు. కార్గిల్‌ యుద్ధానికి ముఖ్య కారకుడైన ఆయనతో కలవడం పట్ల వీరెందుకు (నెటిజన్లు) ఎందుకు మాట్లాడరు..?’ అని సుబ్రహ్మణ్యస్వామి ప్రశ్నించారు.

‘ముషారఫ్‌ నాకు వ్యక్తిగతంగా తెలుసు. పాకిస్థాన్‌లో, భారత్‌లో ఎన్నోసార్లు ఆయన్ను కలిశాను. సైనిక తిరుగుబాటు తర్వాత దేశాధ్యక్షుడైన ముషారఫ్‌.. భారత్‌తో కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నట్లు నాతో చెప్పారు. తాలిబన్లను అంతం చేసేందుకు అమెరికాతో కలిసి పనిచేశారు. ముషారఫ్‌ విషయంలో నన్ను ప్రశ్నించే ముందు.. కార్గిల్‌ యుద్ధానికి ముఖ్య కారకుడైన నవాజ్‌ షరీఫ్‌ ఇంటికి మోదీ ఎందుకు వెళ్లారనే పశ్నకు నెటిజన్లు సమాధానమివ్వలేరు’ అని సుబ్రహ్మణ్యస్వామి  అన్నారు.

నిర్మలమ్మది బోగస్‌ బడ్జెట్‌..

నిర్మలా సీతారామన్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేట్టినప్పటి నుంచి ఆమెపై విమర్శలు చేస్తున్న సుబ్రహ్మణ్యస్వామి.. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఓ బోగస్‌ అని మండిపడ్డారు. ‘కొన్నేళ్లుగా దేశ వృద్ధి రేటు 3 నుంచి 4 శాతం మాత్రమే ఉంటోంది. కానీ, వచ్చే ఏడాదికి 6.5 శాతం వృద్ధి రేటు ఉంటుందని చెప్పారు. 2019 నుంచి లేనిది ఇప్పుడెలా సాధ్యం..? వ్యవసాయం, పరిశ్రమలకు అందులో ప్రాధాన్యతే లేదు. ప్రభుత్వానికి ఎటువంటి వ్యూహం లేదని బడ్జెట్‌లో స్పష్టంగా తెలుస్తోంది’ అని తాజా బడ్జెట్‌పై సుబ్రహ్మణ్యస్వామి మండిపడ్డారు. వీటితోపాటు మద్రాస్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్‌ విక్టోరియా గౌరీని నియమించడాన్ని సమర్థించిన ఆయన.. ఆమెపై వచ్చిన విమర్శలు దురుద్దేశంతో కూడుకున్నవని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని