PM Modi: భారత ప్రజాస్వామ్యంపై విదేశాల్లో వ్యాఖ్యలు దురదృష్టకరం: మోదీ

కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ (Cambridge University)లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ తప్పుబట్టారు. భారత ప్రజాస్వామ్యం గురించి విదేశాల్లో తక్కువ చేసి మాట్లాడటం దురదృష్టకరమన్నారు.

Published : 12 Mar 2023 23:21 IST

బెంగళూరు: బ్రిటన్‌ పర్యటన సందర్భంగా లండన్‌ (London)లోని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ (Cambridge University)లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ (PM Modi) తప్పుబట్టారు. భారత ప్రజాస్వామ్యం గురించి విదేశాల్లో ప్రశ్నలు లేవనెత్తడం దురదృష్టకరమంటూ పరోక్షంగా రాహుల్‌ని విమర్శించారు. భారత ప్రజాస్వామ్యాన్ని ఏ శక్తులూ నీరుగార్చలేవన్న ప్రధాని.. కొందరు అదే పనిగా డెమోక్రసీపై దాడి చేస్తున్నారని అన్నారు. వీరంతా కన్నడ ప్రజల ఆరాధ్యదైవం బసవేశ్వరుడ్ని, కర్ణాటక ప్రజల్ని, భారత ప్రజానీకాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆరోపించారు. అలాంటి వారిని కర్ణాటక ప్రజలు దూరం పెట్టాలని హితవు పలికారు. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. హుబ్బళ్లిలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపొడవైన రైల్వే ప్లాట్‌ఫాంను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ధార్వాడ్‌ (Dharwad)లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు భారత ప్రజాస్వామ్యం గురించి అధ్యయనం చేస్తున్నాయి. ప్రపంచంలోనే భారత్‌ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మాత్రమే కాదు.. ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిదని చెప్పే స్థితిలో మనం ఉన్నాం. ఇలాంటి సమయంలో భారత్‌ ప్రజాస్వామ్య విలువలను తగ్గించేలా మాట్లాడటం దురదృష్టకరం’’ అని ప్రధాని మోదీ అన్నారు.

భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగేలా తనతోపాటు ఎంతో మందిపై అధికార పార్టీ నాయకులు ప్రత్యేక నిఘా ఉంచారంటూ లండన్‌లోని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిలో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. స్వాతంత్యం వచ్చిన నాటి నుంచి భారత్‌ సాధించిన అభివృద్ధిని ప్రధాని మోదీ తుంగలో తొక్కేశారని ఆయన విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గత 60-70 ఏళ్లలో భారత్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విదేశాల్లో  మోదీ ప్రకటించాలని రాహుల్‌ సవాల్‌ విసిరారు. గడిచిన పదేళ్లలో భారత్‌లో అంతులేని అవినీతి రాజ్యమేలుతోందని ఈ సందర్భంగా రాహుల్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌, భాజపా నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పదేపదే ఎన్నికల్లో ఓటమి చవిచూసిన రాహుల్‌ గాంధీ.. విదేశాల్లో భారత్‌ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా ప్రవర్తించారని భాజపా మండిపడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని