Covid: మరో 4 రాష్ట్రాల సీఎంలకు మోదీ ఫోన్‌

దేశంలో కరోనా విలయం కొనసాగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ సీఎంలు

Published : 08 May 2021 15:22 IST

దిల్లీ: దేశంలో కరోనా విలయం కొనసాగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ సీఎంలు ఉద్ధవ్‌ ఠాక్రే, ఎంకే స్టాలిన్‌, శివరాజ్‌ సింగ్ చౌహన్‌, జైరామ్ ఠాకూర్‌లకు వేర్వేరుగా ఫోన్‌ చేసిన ప్రధాని.. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్‌ పరిస్థితుల గురించి చర్చించారు. 

మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు, తగ్గుతున్న పాజిటివిటీ రేటు గురించి ప్రధానికి వివరించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చౌహన్‌ మోదీతో ఫోన్‌ సంభాషణ అనంతరం ట్విటర్‌లో వెల్లడించారు. ‘‘కరోనా వ్యాప్తి నియంత్రణకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. వైరస్‌ కట్టడికి కేంద్రం నుంచి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ప్రధానితో ఫోన్‌లో మాట్లాడినట్లు హిమాచల్‌ సీఎం జైరామ్‌ ఠాకూర్‌ కూడా ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక మహారాష్టకు మరింత ఆక్సిజన్‌ సరఫరా చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఠాక్రే ప్రధానిని కోరారు. 

మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. అక్కడ శుక్రవారం 54వేల కొత్త కేసులు నమోదవ్వగా.. 898 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇక మధ్యప్రదేశ్‌లో నిన్న 11,708, హిమాచల్‌ప్రదేశ్‌లో 4,177 కొత్త కేసులు వెలుగుచూశాయి. తమిళనాడులోనూ వైరస్‌ విజృంభణ ఎక్కువగానే ఉంది. రాష్ట్రంలో తాజాగా 26వేల పైచిలుకు రోజువారీ కేసులు బయటపడ్డాయి. కరోనా వ్యాప్తి కట్టకి కోసం నూతనంగా ఏర్పాటైన స్టాలిన్‌ ప్రభుత్వం రెండు వారాల సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించింది. 

గత మూడు రోజులుగా ప్రధాని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్‌ చేసి కొవిడ్ పరిస్థితిపై ఆరా తీస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫోన్‌ సంభాషణను విమర్శిస్తూ ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ట్వీట్‌ చేయడం.. దాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఖండించడం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని