PM Modi: ఈ ఫలితాలు వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ప్రతిబింబం: ప్రధాని మోదీ

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భాజపా ఘన విజయం సాధించిన సందర్భంగా దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

Updated : 10 Mar 2022 20:53 IST

దిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భాజపా ఘన విజయం సాధించిన సందర్భంగా దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ వెలువడిన ఫలితాలు వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ప్రతిబింబమని వ్యాఖ్యానించారు. ఈసారి హోలీ మార్చి 10నే మొదలైందన్న మోదీ.. భాజపా శ్రేణులకు అభినందనలు తెలిపారు. సుపరిపాలన వల్లే ఈ ఫలితాలు వచ్చాయని, భాజపా విజయంలో మహిళలు, యువతది కీలకపాత్ర అని మోదీ అన్నారు.

‘‘37 ఏళ్ల తర్వాత యూపీలో ఒక పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. యూపీ ప్రజలు 2014 నుంచి అభివృద్ధికే ఓటేశారు. 2017 యూపీ ఫలితాలు 2019 ఫలితాలను చూపాయి. 2022 యూపీ ఫలితాలు 2024 ఎన్నికలను చూపాయి. యూపీ ప్రజలు దేశ విచ్ఛిన్నకర శక్తులను దూరం పెట్టారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉన్న చోట ప్రజా క్షేమమే ధ్యేయంగా పాలన ఉంది. ఈ ఎన్నికలు చాలా సంక్లిష్ట సమయంలో జరిగాయి. కరోనా మహమ్మారితో పోరాడుతున్న వేళ ఈ ఎన్నికలు వచ్చాయి. మేం తీసుకున్న చర్యల వల్ల కరోనా సంక్షోభం నుంచి బయటపడ్డాం. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు, నూనెల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఆత్మనిర్భర్‌ భారత్‌కు బడ్జెట్‌లో కొత్త శక్తిని అందించాం. భవిష్యత్‌లో పంజాబ్‌లోనూ మా పార్టీ జెండా ఎగురవేస్తాం. కోట్ల మంది మాతృమూర్తులు, మహిళా శక్తే మాకు రక్షణ.

తొలిసారి ఓటు వేసిన యువత భాజపాకే అండగా నిలిచారు. సంక్షోభ సమయంలో స్థిరమైన ప్రభుత్వానికి అండగా నిలిచారు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన సమయమిది. వందేళ్లలో ఎప్పుడూ చూడని విపత్తు కరోనా వల్ల చూశాం. మేం తీసుకున్న చర్యల వల్ల కరోనా సంక్షోభం నుంచి బయటపడ్డాం. కష్ట కాలంలో కొందరు దిగజారుడు రాజకీయాలు చేశారు. కొందరు నేతలు కరోనా వ్యాక్సిన్‌ను కూడా ప్రశ్నించారు. ‘ఆపరేషన్‌ గంగ’ను ఆపేందుకు కొందరు ప్రయత్నించారు. ప్రజలు ఎప్పుడూ అభివృద్ధి మంత్రాన్నే జపిస్తారని యూపీలో రుజువైంది. పేదలకు ఇల్లు, రేషన్‌, వ్యాక్సిన్‌ అందించడమే భాజపా లక్ష్యం. ఈ దేశంలో అవినీతి అంతం కావాలా? వద్దా?. ప్రజాధనం దోచుకుని జేబులు నింపుకొనే వారిపై చర్యలు తప్పవు. ఏదో ఒక రోజు వారసత్వ రాజకీయాలు అంతమవుతాయి’’ అని ప్రధాని మోదీ అన్నారు.

దేశ రాజకీయాలను మోదీ సమూలంగా మారుస్తున్నారు: నడ్డా

దేశ రాజకీయాలను ప్రధాని నరేంద్ర మోదీ సమూలంగా మారుస్తున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. నాలుగు రాష్ట్రాల్లో పార్టీకి విజయాన్ని చేకూర్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. యూపీ, గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌లో ఓటర్ల ఆశీర్వాదంతో నెగ్గుకొచ్చామని, ఈ విజయం కోట్లాది భాజపా కార్యకర్తలదని పేర్కొన్నారు.   యూపీ ప్రజలు వరుసగా రెండోసారి తమను ఆశీర్వదించారని తెలిపారు. విజయోత్సవ సభ నేపథ్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. ప్రధాని మోదీపై భాజపా శ్రేణులు పూలవర్షం కురిపించారు. తొలుత కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీతోపాటు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా.. ప్రధాని మోదీని గజమాలతో సత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని