PM Modi: అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్‌ నిలిచి గెలిచింది: ప్రధాని మోదీ

త్యాగధనుల పోరాట ఫలితమే మన స్వాతంత్ర్యమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మహనీయులు మనకు స్వాతంత్ర్యాన్ని అందించారని..

Updated : 15 Aug 2022 10:48 IST

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని

దిల్లీ: త్యాగధనుల పోరాట ఫలితమే మన స్వాతంత్ర్యమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మహనీయులు మనకు స్వాతంత్ర్యాన్ని అందించారని.. బానిస సంకెళ్ల ఛేదనలో వారి పోరాటం అనుపమానమని కొనియాడారు. గాంధీ, సుభాష్‌చంద్రబోస్‌, అంబేడ్కర్‌ వంటివారు మార్గదర్శకులని చెప్పారు. ఎంతోమంది సమరయోధులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారన్నారు. మహనీయుల తిరుగుబాట్లు మనకు స్ఫూర్తి అని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని మోదీ ఎగురవేశారు. అనంతరం జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. 

మన ముందున్న మార్గం కఠినమైనది

‘‘దేశ ప్రజలందరికీ సాతంత్ర్య వజ్రోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం జరుగుతోంది. ఈ అమృత మహోత్సవ వేళ భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలుపుకొంటున్నాను. అమృత మహోత్సవాల వేళ కొత్త దశ, దిశ ఏర్పాటు చేసుకోవాలి. త్యాగధనుల బలిదానాలను స్మరించుకునే అదృష్టం కలిగింది. దేశ నలుమూలలా ఎంతోమంది వీరులను స్మరించుకునే రోజు ఇది. జీవితాలనే త్యాగం చేసిన వారి ప్రేరణతో నవ్యదిశలో పయనించాలి. మన ముందున్న మార్గం కఠినమైనది. ప్రతి లక్ష్యాన్ని సకాలంలో సాధించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. వందల ఏళ్ల బానిసత్వంలో భారతీయతకు భంగం కలిగింది. బానిసత్వంలో భారతీయత భావన గాయపడింది. ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్‌ నిలిచి గెలిచింది. ప్రపంచ యవనికపై దేశం తనదైన ముద్ర వేసింది.

ప్రజాస్వామ్య దేశాలకు భారత్‌ మార్గదర్శి..

అభివృద్ధి చెందిన ప్రపంచదేశాల సరసన భారత్‌ను నిలబెడదాం. స్వచ్ఛ భారత్‌, ఇంటింటికీ విద్యుత్‌ సాధన అంత తేలిక కాదు. లక్ష్యాలను వేగంగా చేరుకునేలా భారత్‌ ముందడుగు వేస్తోంది. యువశక్తిలో దాగి ఉన్న సామర్థ్యాలను వెలికితీయాలి. ఎంతోమంది యువత స్టార్టప్‌లతో ముందుకొస్తున్నారు. మన మూలాలు బలంగా ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగగలం. పర్యావరణ పరిరక్షణ కూడా అభివృద్ధిలో భాగమే. ప్రకృతితో ముడిపడిన అభివృద్ధిని ప్రపంచానికి చూపించాలి. నిలబడదనుకున్న భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శం. ప్రజాస్వామ్య దేశాలకు భారత్‌ మార్గదర్శిగా నిలిచింది. మహాత్ముని ఆశయాలకు.. భారతీయులందరి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నాం. దేశ ప్రగతిని పరుగులు పెట్టించేందుకు ప్రతి పౌరుడు సిద్ధంగా ఉన్నాడు.


వచ్చే 25 ఏళ్లు అత్యంత ప్రధానమైనవి

కేంద్రం, రాష్ట్రాలు ప్రజల ఆశల సాకారమే లక్ష్యంగా పనిచేయాలి. ప్రతిక్షణం కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. భారత ప్రజానీకం నవచేతనతో ముందడుగు వేస్తోంది. ప్రపంచ దేశాల సరసన నిలబడేందుకు సమష్టి కృషిచేయాలి. దేశం నలుమూలలా అభివృద్ధి కాంక్ష రగిలిపోతోంది. భారత్‌ ఇవాళ సగర్వంగా తలెత్తుకుని నిలబడింది. ప్రపంచమంతా మన వైపు చూస్తోంది. ప్రపంచ ఆకాంక్షల సాకారానికి భారత్ సిద్ధంగా ఉంది. రాజకీయ సుస్థిరత వల్ల ప్రయోజనాలను భారత్‌ ప్రపంచానికి చూపింది. వచ్చే 25 ఏళ్ల అమృతకాలం మనకు అత్యంత ప్రధానమైనది. సంపూర్ణ అభివృద్ధి మనముందున్న అతిపెద్ద సవాల్‌. మనలో దాగిఉన్న బానిస మనస్తత్వాన్ని తుదముట్టించాలి. సర్వ స్వతంత్ర ప్రజాస్వామ్యంగా మనం నిలబడాలి’’ అని మోదీ పిలుపునిచ్చారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని