PM Modi: సముద్ర వాణిజ్యానికి అవరోధాలు తొలగాలి.. ఐరాసలో మోదీ

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ)లో సోమవారం సముద్ర భద్రత అంశంపై ప్రధాని మోదీ ప్రసంగించారు.

Updated : 09 Aug 2021 20:01 IST

దిల్లీ: ప్రపంచ దేశాల మధ్య సముద్ర మార్గంలో వాణిజ్యానికి ప్రస్తుతం ఎదురవుతున్న అవరోధాలను తొలగించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ సూచించారు. అంతర్జాతీయ దేశాల మధ్య సముద్ర సహకారం పెంచడానికి పలు సూత్రాలను ప్రస్తావించారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ)లో సోమవారం సముద్ర భద్రత అంశంపై వర్చువల్‌గా ఆయన ప్రసంగించారు. ఈ సమావేశానికి ఆయనే అధ్యక్షత వహించారు. ప్రస్తుతం భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో భారత్‌ ఉండడంతో మోదీకి ఈ అవకాశం దక్కింది. ఇలా ఓ ఐరాస చర్చకు అధ్యక్షత వహిస్తున్న తొలి భారత ప్రధాని మోదీయే కావడం విశేషం.

సముద్ర మార్గాలు ప్రపంచ దేశాలకు దక్కిన వారసత్వ సంపద అని, ఈ మార్గాలు ప్రపంచ వాణిజ్యానికి జీవనాడి అని ప్రధాని మోదీ అన్నారు. అలాంటి మార్గాలు పైరసీ కోసం, తీవ్రవాదుల కోసం దుర్వినియోగం అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే అనేక దేశాల మధ్య సముద్ర వివాదాలు ఉన్నాయన్నారు. వీటిని శాంతియుతంగా, అంతర్జాతీయ చట్టాల ఆధారంగా పరిష్కరించుకోవాలన్నారు. సముద్ర వాణిజ్యం పెరగాలంటే ఇటువంటి అవరోధాలన్నీ తొలగాలన్నారు. అదే సమయంలో సముద్ర పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మోదీ చెప్పారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చమురు కారణంగా సముద్ర జలాలు కలుషితం కాకుండా చూసుకోవాలని సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. సముద్రంలో సంభవించే తుపానులు, సునామీలను కలిసికట్టుగా ఎదుర్కోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని