ఇది 140 కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిబింబం.. : కొత్త పార్లమెంట్‌లో ప్రధాని మోదీ

నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా పార్లమెంటు సభ్యులను ఉద్దేశిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర నేతలు తొలి ప్రసంగం చేశారు.

Updated : 28 May 2023 14:17 IST

దిల్లీ: నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్వీకర్‌ ఓంబిర్లాతోపాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌, ఎంపీలు, పలువురు సీఎంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణసింగ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి ప్రసంగం చేశారు.

ఇది ప్రజల ఆకాంక్షల ప్రతిబింబం.. : మోదీ

‘దేశ వికాస యాత్రలో ఎప్పటికీ నిలిచిపోయే కొన్ని గడియలు వస్తాయి. అమృతోత్సవ వేళ చరిత్రాత్మక ఘటనలో ప్రజలు భాగస్వాములయ్యారు. ఇది కేవలం భవనం కాదు. 140 కోట్ల ప్రజల ఆకాంక్షల, కలల ప్రతిబింబం. ప్రపంచానికి భారత్‌ దృఢ సంకల్ప సందేశం ఈ కొత్తభవనం ఇస్తుంది. స్వాతంత్ర్య సమరయోధుల కలల సాకార మాధ్యమంగా, ఆత్మనిర్భర భారత్‌కు సాక్షిగా ఇది నిలుస్తుంది. నవ భారత్‌ కొత్త మార్గాలు నిర్దేశించుకుంటూ ముందుకెళ్తోంది. కొత్త ఆలోచనలు, సంకల్పంతో భారత్‌ ప్రగతి పథాన పయనిస్తోంది. ప్రపంచం మొత్తం మన దేశ సంకల్పం, అభివృద్ధిని గమనిస్తోంది’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

‘ఈ పార్లమెంటు.. ప్రజాస్వామ్య దేవాలయం. ఇది అనేక సంస్కృతుల సమ్మేళనం. చరిత్రాత్మక సమయంలో సెంగోల్‌ ప్రతిష్ఠాపన జరిగింది. కర్తవ్యం, సేవకు ఇది ప్రతీకగా నిలుస్తుంది. సభ కార్యకలాపాల వేళ ప్రేరణగా ఉంటుంది. ప్రజాస్వామ్యం పురుడు పోసుకున్న నేల భారత్‌. ఇక్కడ జరిగే నిర్ణయాలు దేశ ఉజ్వల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వంచిత, పీడిత వర్గాలకు పార్లమెంట్‌ ద్వారా న్యాయం జరగాలి. ఇక్కడ చేసే చట్టాలతో దేశం మరింత పురోభివృద్ధి సాధిస్తుంది. భారత్‌ మళ్లీ పూర్వవైభవం సాధిస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు.

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా..

‘పాత భవనంలో సభ్యుల కార్యకలాపాలకు ఇబ్బందిగా ఉండేది. భవిష్యత్తులో ఎంపీల సంఖ్య పెరుగుతుంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం జరిగింది. ఆధునిక, సాంకేతికతలతో కూడిన కొత్త భవనం ఆవశ్యకత ఏర్పడింది. ఈ భవనం ప్రపంచ దేశాలకు ప్రేరణగా నిలుస్తుంది. కొత్త భవనం చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు. భారత్‌ వృద్ధి.. ప్రపంచ వృద్ధికి ప్రేరణగా నిలుస్తుంది’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.

ప్రధాని దృఢ సంకల్పంతో : ఓంబిర్లా

అమృతోత్సవ వేళ చరిత్రాత్మక ఘట్టానికి పార్లమెంటు సాక్షిగా నిలిచింది. ప్రధాని దృఢ సంకల్పంతో ఈ నూతన భవనం సాకారామైంది. వేలాది కార్మికుల కృషితో రెండున్నరేళ్లలోనే ఇది పూర్తయ్యింది. దేశ ప్రజల సంకల్పంతో కరోనా విపత్తు నుంచి గట్టెక్కాం. 70ఏళ్లకుపైగా ప్రజా సమస్యలపై ఇక్కడ చర్చలు జరిగాయి. సభ నిర్ణయాలతో ప్రజల జీవన విధానాల్లో గణనీయ మార్పులు వచ్చాయి’ అని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా పేర్కొన్నారు.

ప్రపంచానికి నేతృత్వం వహించే దిశగా భారత్‌..

‘దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు కొత్త పార్లమెంటు భవనం ద్వారా నెరవేరుతాయి. చరిత్రాత్మకమైన రోజు దేశ ప్రజలందరూ గర్వపడాలి. గత పార్లమెంటు భవనం ప్రగతికి మార్గదర్శకంగా నిలిచింది. స్వాతంత్ర్య ప్రాప్తి, రాజ్యాంగ నిర్మాణం వంటి అనేక చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచింది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త భవనం ఆవశ్యకత ఏర్పడింది. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో నూతన భవనం నిర్మాణం జరిగింది. మున్ముందు సభ బాధ్యతలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరింత మెరుగైన సభా కార్యకలాపాల కోసమే ఈ కొత్త భవన నిర్మాణం జరిగింది. రెండున్నరేళ్ల స్వల్ప వ్యవధిలోనే నిర్మించడం హర్షణీయం. రానున్న రోజుల్లో ప్రపంచ యవనికపై భారత్‌ అగ్రస్థానంలో నిలుస్తుంది. ప్రపంచానికి నేతృత్వం వహించే విధంగా భారత్‌ మారుతుంది’ అని డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణసింగ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని