PM Modi: వెంకయ్యనాయుడి చమత్కారాలు.. విజయ సూత్రాలు: మోదీ

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అత్యంత జనాదరణ ఉన్న నాయకుడని.. అనేక బాధ్యతలను ఆయన సమర్థంగా నిర్వర్తించారని 

Updated : 08 Aug 2022 15:11 IST

దిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అత్యంత జనాదరణ ఉన్న నాయకుడని.. అనేక బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. ఈ నెల 10న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం పూర్తిచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభలో సోమవారం నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. వెంకయ్య పనితీరు ఎందరికో స్ఫూర్తిదాయకమంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.

‘‘వెంకయ్యనాయుడుతో భుజం కలిపి పనిచేసే అదృష్టం నాకు లభించింది. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా.. సభా నాయకుడిగా ఆయన సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏ పదవిలో ఉన్నా అంకిత భావంతో పనిచేశారు. తన బాధ్యతలను ఎప్పుడూ బరువుగా భావించలేదు. వెంకయ్య పని విధానం.. ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన శ్రద్ధ, బాధ్యత ప్రతి ఒక్కరికీ ఆదర్శం. సమాజం, ప్రజాస్వామ్యం ఆయన్నుంచి చాలా నేర్చుకోవాలి’’ అని మోదీ ప్రశంసించారు.

‘‘వెంకయ్యనాయుడు ఏక వాక్య సంబోధనలు చాలా ప్రాచుర్యం పొందాయి. అవి చాలా చమత్కారంగా ఉంటాయి. కొన్నిసార్లు అవే విజయ సూత్రాలుగానూ మారాయి. ఆయన ప్రతిమాటను అందరూ విన్నారు. ప్రాధాన్యం, గౌరవం ఇచ్చారు. ఎన్నడూ కౌంటర్‌ చేయలేదు. ఆయనేం మాట్లాడినా అందులో లోతైన భావం ఉంటుంది. ఇక భారతీయ భాషలపై ఆయనకున్న ఆసక్తి, పట్టు ఎప్పటికీ ప్రత్యేకమే. దీనిపై ప్రతిఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి. సభను నడిపే విధానంలో ఈ ప్రత్యేకత ప్రతిబింబించింది. రాజ్యసభ పనితీరును పెంచడానికి అది ఎంతగానో దోహదపడింది. ఆయన హయాంలో రాజ్యసభ ఉత్పాదకత 70శాతానికి పెరిగింది. ఎంపీల హాజరు కూడా మెరుగుపడింది. ఉపరాష్ట్రపతిగా.. యువత సంక్షేమానికి కృషి చేశారు. యువశక్తిపై ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన చాలా సార్లు ఓ మాట చెబుతుంటారు. ‘నేను రాజకీయాల నుంచి రిటైర్‌ అవుతున్నాను గానీ.. ప్రజా జీవితం నుంచి అలసిపోను అని’. అందువల్ల రాజ్యసభ ఛైర్మన్‌గా మీ బాధ్యతలు ఇక్కడితో ఆగిపోవచ్చు. కానీ మీ అనుభవాల నుంచి మేం మరిన్ని ప్రయోజనాలను పొందడం మాత్రం కొనసాగుతంది’’ అని ప్రధాని ఉద్విగ్నభరితులయ్యారు. ప్రధాని ప్రసంగం విని వెంకయ్యనాయుడు కూడా ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని