PM Modi: 18వ లోక్‌సభ ప్రారంభం.. ఎంపీగా ప్రమాణం చేసిన మోదీ

PM Modi: లోక్‌సభ సభ్యుడిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన తర్వాత కేంద్రమంత్రులు ఎంపీలుగా ప్రమాణం చేస్తున్నారు.

Updated : 24 Jun 2024 11:40 IST

దిల్లీ: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు (18th Lok Sabha) సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌.. సభ్యులతో ప్రమాణస్వీకార కార్యక్రమం చేపట్టారు. లోక్‌సభాపక్ష నేతగా ప్రధాని మోదీ (PM Modi) తొలుత ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన పోడియం వద్దకు రాగానే ఎన్డీయే కూటమి సభ్యులంతా మోదీ, మోదీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కేంద్రమంత్రులు, ఇతర సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేయిస్తున్నారు.

తొలి రోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారితో మంగళవారం ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్‌ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 26న స్పీకర్‌ ఎన్నిక పూర్తవుతుంది. 27న రాజ్యసభ కూడా ప్రారంభం కానుంది. అదే రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు.

50ఏళ్ల క్రితం నాటి పొరబాటు మళ్లీ జరగొద్దు: ‘ఎమర్జెన్సీ’పై మోదీ కీలక వ్యాఖ్యలు

రాజ్యాంగం చిరు ప్రతులతో విపక్షాలు.. 

విపక్ష ఇండియా కూటమి (INDIA Alliance) ఎంపీలు పార్లమెంటు సముదాయంలోని పాత భవనం వద్ద కలుసుకుని, అక్కడి నుంచి నూతన భవనం వరకు ర్యాలీగా వచ్చారు. మొన్నటివరకు మహాత్మాగాంధీ విగ్రహం ఉన్న ప్రాంతంలో రాజ్యాంగం చిరు ప్రతులను చేతపట్టుకుని కొంతసేపు నిరసన చేపట్టారు. అనంతరం వీరంతా ఒకేసారి లోక్‌సభకు వెళ్లారు.

ఇక, సభ ప్రారంభం కాగానే కేరళలోని వయనాడ్‌ స్థానానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన రాజీనామాను స్పీకర్‌ ఆమోదించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ రాహుల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం వయనాడ్‌ను వదులకుని రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగాలని ఆయన నిర్ణయించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని