PM Modi: జీ7 సదస్సుకు ఇటలీ వెళ్లనున్న ప్రధాని

ప్రధానమంత్రిగా మూడోవిడత బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోదీ ఈ వారం తన తొలి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇటలీలో జరగనున్న జీ7 అధునాతన ఆర్థికవ్యవస్థల వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరవుతారు.

Published : 12 Jun 2024 06:13 IST

మూడోసారి బాధ్యతలు చేపట్టాక తొలి విదేశీ పర్యటన

దిల్లీ: ప్రధానమంత్రిగా మూడోవిడత బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోదీ ఈ వారం తన తొలి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇటలీలో జరగనున్న జీ7 అధునాతన ఆర్థికవ్యవస్థల వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరవుతారు. అపూలియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియాలో గల ఓ రిసార్టులో ఈనెల 13 - 15 తేదీల మధ్య ఈ సమావేశం జరగనుంది. ఉద్ధృతమవుతున్న ఉక్రెయిన్‌ యుద్ధం, గాజా సంఘర్షణ ఈ సదస్సులో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది. అమెరికా, ఫ్రెంచ్‌ అధ్యక్షులు జో బైడెన్, ఇమ్మానుయేల్‌ మెక్రాన్‌లతోపాటు జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిద, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తదితర అగ్రనేతలు హాజరుకానున్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఒక సెషన్‌కు హాజరై తమ దేశంపై రష్యా జరుపుతున్న దాడిపై చర్చలో పాల్గొంటారు. మోదీ ఇటలీ పర్యటనపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా ఆయన 13న బయలుదేరి, 14వ తేదీ రాత్రికి మళ్లీ భారత్‌కు చేరుకుంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రధానితోపాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్, విదేశాంగ కార్యదర్శి వినయ్‌ క్వాట్రా, జాతీయ భద్రతాధికారి (ఎన్‌ఎస్‌ఏ) అజీత్‌ డోభాల్‌లతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఇటలీ వెళుతున్నట్లు వెల్లడించాయి. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతోపాటు పలువురు నేతలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అయితే, దౌత్య విభేదాలు కొనసాగుతున్న వేళ కెనడా ప్రధాని ట్రూడోతో ముఖాముఖి భేటీ ఉంటుందా? అనేదానిపై మాత్రం స్పష్టత లేదు. గతేడాది మే నెల హిరోషిమాలో జరిగిన జీ7 సమావేశానికి మోదీ హాజరయ్యారు. జీ7 కూటమిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్‌ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ వార్షిక సమావేశానికి భారత్‌తోపాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని 11 అభివృద్ధి చెందుతున్న దేశాల నేతలను ఇటలీ ఆహ్వానించింది.   

18న వారణాసికి ప్రధాని..

వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 18న తన నియోజకవర్గమైన వారణాసికి వెళ్లనున్నారు. అక్కడ ‘కిసాన్‌ సమ్మేళన్‌’కు ఆయన హాజరవుతారని భాజపా కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ సదస్సు అనంతరం ప్రధాని కాశీ విశ్వనాథుణ్ని దర్శించుకొని ప్రార్థనలు చేస్తారు.   

యోగా జీవితంలో భాగం కావాలి : మోదీ

జూన్‌ 21 నాటి పదో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏకత్వం, సామరస్యాలకు శాశ్వత ప్రతీకగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రజలకు పిలుపునిచ్చారు. యోగాను జీవితంలో అంతర్భాగం చేసుకోవడమే కాకుండా ఇతరులనూ ఆ దిశగా ప్రోత్సహించాలని ‘ఎక్స్‌’ ద్వారా కోరారు.


మోదీకి ఖతర్, ఒమన్‌ పాలకుల శుభాకాంక్షలు

వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టాక ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు మోదీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఖతర్‌ అమీర్‌ షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ అల్‌ థానీ మంగళవారం మోదీతో మాట్లాడారు. ఒమన్‌ సుల్తాను హేతం బిన్‌ తారిఖ్‌ సైతం ప్రధాని మోదీతో మాట్లాడి శుక్షాకాంక్షలు తెలిపారు. భారత్‌ - ఖతర్, ఒమన్‌ సంబంధాలను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు ఈ నేతలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. శుభాకాంక్షలు తెలిపిన ఖతర్, ఒమన్‌ పాలకులకు మోదీ కృతజ్ఞతలు చెప్పారు. రానున్న ఈదుల్‌ అధా (బక్రీద్‌) పండుగకు శుభాకాంక్షలు తెలిపారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని