PM Modi: జూన్‌లో అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ!

ప్రధాని మోదీ (PM Narendra Modi) వచ్చే నెలలో అమెరికా (USA)లో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ (Joe Biden), ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ (Jill Biden)లు ప్రధాని మోదీ కోసం స్టేట్‌ డిన్నర్‌ను ఏర్పాటు చేస్తారని కేంద్రం తెలిపింది.

Published : 10 May 2023 23:57 IST

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అమెరికా పర్యటనకు తేదీ ఖరారైంది. వచ్చే నెల 22న ప్రధాని అమెరికా (USA)లో పర్యటించనున్నారు. మోదీ పర్యటనకు సంబంధించిన వివరాలను కేంద్రం వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ (Joe Biden), ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ (Jill Biden)లు ప్రధాని మోదీ కోసం స్టేట్‌ డిన్నర్‌ను ఏర్పాటు చేస్తారని తెలిపింది. ‘‘ఈ పర్యటన భారత్‌, అమెరికాలు అనేక రంగాల్లో ఇప్పటికే కొనసాగిస్తున్న వ్యూహాత్మక భాగస్వామ్య ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. సాంకేతికత, వాణిజ్యం, పరిశ్రమలు, రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాల గురించి ఈ పర్యటనలో ఇరు దేశాధినేతలూ చర్చించనున్నారు. దాంతోపాటు వివిధ రంగాల్లో బలమైన ద్వైపాక్షిక సహకారాన్ని కొనసాగించడంపైనా సమీక్షిస్తారు’’ అని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను అడ్డుకునేందుకు బైడెన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, అమలు చేస్తున్న విధివిధానాలకు మద్దతుగా ప్రధాని మోదీ పర్యటన సాగుతుందని కేంద్రం పేర్కొంది. బైడెన్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 2021లో ప్రధాని మోదీ వైట్‌హౌస్‌లో ఆయన్ను కలిశారు. గత నెలలో ఆధునిక డిఫెన్స్‌, కంప్యూటింగ్ టెక్నాలజీతోపాటు జనరల్‌ ఎలక్ట్రిక్‌ జెట్‌ ఇంజిన్‌ తయారీకి సంబంధించి అవసరమైన సాంకేతికత అభివృద్ధికి ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని సంయుక్తంగా ప్రకటించాయి. ప్రధాని మోదీ పర్యటన రెండు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని, స్నేహపూర్వక సబంధాలను మరింత బలోపేతం చేస్తాయని అమెరికా ప్రకటించింది. ‘‘ఈ పర్యటన ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భద్రతకు సంబంధించి రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు అంతరిక్షం, సాంకేతిక రంగాల్లో ఇరుదేశాల పరస్పర సహాకారాన్ని చాటి చెబుతుంది’’ అని వైట్‌హౌస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని