Modi: ‘మీరు కాదు.. నేనే మొక్కాలి’.. జిల్లా అధ్యక్షుడి పాదాలకు నమస్కరించిన ప్రధాని

యావత్‌ దేశాన్ని ఆకర్షిస్తోన్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఎన్నికల

Published : 22 Feb 2022 01:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యావత్‌ దేశాన్ని ఆకర్షిస్తోన్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఉన్నావ్‌లో ప్రచారంలో పాల్గొన్న ప్రధాని.. వేదికపై పార్టీ జిల్లా అధ్యక్షుడి పాదాలకు నమస్కరించారు. అసలేం జరిగిందంటే..

ఉన్నావ్‌ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధానికి.. భాజపా యూపీ చీఫ్‌ స్వతంత్ర దేవ్‌ సింగ్‌, ఉన్నావ్‌ జిల్లా అధ్యక్షుడు అవదేశ్‌ కతియార్‌ శ్రీరాముడి విగ్రహాన్ని బహూకరించారు. కానుకను అందించిన తర్వాత అవదేశ్‌.. ప్రధాని పాదాలను తాకేందుకు కిందకు వంగారు. అయితే మోదీ అయనను వద్దని వారించారు. ‘‘మీరు కాదు.. నేనే మీకు మొక్కాలి’’ అని సంజ్ఞ చేస్తూ ప్రధాని వెంటనే అవదేశ్‌ కతియార్‌ పాదాలకు నమస్కరించారు. ఈ అనూహ్య ఘటనతో అక్కడున్న వారంతా కరతాళ ధ్వనులు చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోను భాజపా అధికార ప్రతినిధి సాంబిత్‌ పాత్రా ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. ‘ప్రధాన సేవకుడు’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

యూపీలో అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే మూడు దశల పోలింగ్‌ పూర్తవ్వగా.. ఫిబ్రవరి 23న నాలుగో విడత ఓటింగ్‌ జరగనుంది. మొత్తం ఏడు విడతల్లో పోలింగ్‌ నిర్వహిస్తుండగా.. మార్చి 10న ఫలితాలు వెల్లడించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని