Modi: తల్లిని కోల్పోయిన దుఃఖంలోనూ.. విధులు మరవని మోదీ

తల్లిని కోల్పోయిన బాధ ఉన్నప్పటికీ ప్రధాని మోదీ తన విధులను మరవలేదు. దుఃఖాన్ని దిగమింగి బెంగాల్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు.

Updated : 30 Dec 2022 13:23 IST

కోల్‌కతా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Modi) మాతృమూర్తి హీరాబెన్‌ (Heeraben) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. తల్లి చనిపోయిన దుఃఖంలో కూరుకుపోయిన ప్రధాని.. తన విధులను మాత్రం మరవలేదు. బాధను దిగమింగుకుని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat express)ను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు.

నిజానికి ప్రధాని మోదీ నేడు పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో పర్యటించాల్సింది. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. కానీ, రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ప్రధాని తల్లి నేడు మరణించడంతో ఆయన హుటాహుటిన గుజరాత్‌ వెళ్లాల్సి వచ్చింది. దీంతో కోల్‌కతా పర్యటనను రద్దు చేసుకున్న మోదీ.. ఆ కార్యక్రమాల్లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. హావ్‌డా, న్యూ జల్‌పయ్‌గురిని కలిపే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee), రాష్ట్ర గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పాల్గొన్నారు. ఇక కోల్‌కతాలో జరిగే జాతీయ గంగా మండలి సమావేశానికి కూడా మోదీ వర్చువల్‌గా అధ్యక్షత వహించనున్నారు.

రాలేకపోయా.. క్షమించండి: మోదీ

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ ప్రజలకు క్షమాపణలు తెలిపారు. తాను బెంగాల్‌కు రావాల్సిందని, కానీ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయాయని చెప్పారు. ఇందుకు బెంగాల్‌ వాసులు తనను క్షమించాలని కోరారు.

మోదీజీ.. విశ్రాంతి తీసుకోండి: మమత

ఈ సందర్భంగా ప్రధాని మోదీతో మాట్లాడుతూ మమతా బెనర్జీ సానుభూతి ప్రకటించారు. ‘‘మాతృమూర్తి మరణం విచారకరం. మీకు తీరని లోటే. మీ అమ్మగారు మాకూ అమ్మే. దుఃఖం నుంచి బయటపడేలా ఆ భగవంతుడు మీకు స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. మోదీజీ. దయచేసి కాస్త విశ్రాంతి తీసుకోండి’’ అని దీదీ విచారం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని