Modi: ‘బ్లూ జాకెట్‌’తో ‘గ్రీన్‌’ మెసేజ్‌ ఇచ్చిన ప్రధాని మోదీ..!

సందర్భాన్ని బట్టి ప్రత్యేక వస్త్రధారణలో కన్పించే ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Modi).. బుధవారం ఓ నీలం రంగు జాకెట్‌ ధరించి పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యారు. మరి ఆ జాకెట్‌ ప్రత్యేకత ఏంటో తెలుసా?

Published : 08 Feb 2023 13:57 IST

దిల్లీ: పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా బుధవారం రాజ్యసభకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ నీలం రంగు జాకెట్‌లో కన్పించారు. సాధారణంగా మోదీ అలాంటి వస్త్రధారణలోనే కన్పిస్తారు కదా.. ఇందులో అంత విశేషమేముంది అంటారా? అయితే, ఈ జాకెట్‌ నిజంగానే ప్రత్యేకమైనది. ప్లాస్టిక్‌ బాటిళ్లను రీసైకిల్‌ చేసి దీన్ని తయారు చేశారు.

బెంగళూరు వేదికగా జరుగుతున్న ‘ఇండియా ఎనర్జీ వీక్‌ 2023’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ సోమవారం పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్.. ప్రధానికి అరుదైన బహుమతిని అందజేసింది. పెట్ ‌(పాలీఇథలిన్‌ టెరెఫ్తలేట్‌) బాటిళ్లను రీసైకిల్‌ చేసి తయారు చేసిన నీలం రంగు జాకెట్‌ను మోదీకి కానుకగా ఇచ్చింది. ఆ జాకెట్‌నే ప్రధాని ధరించి బుధవారం పార్లమెంట్‌కు వచ్చారు.

వాతావరణ మార్పులపై పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రధాని మోదీ ఎల్లప్పుడూ ముందుంటారన్నది తెలిసిందే. ఆ మధ్య మహాబలిపురంలో స్వయంగా చీపురు చేతబట్టి బీచ్‌ను శుభ్రం చేసిన ప్రధాని.. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక తాజా ‘బ్లూ జాకెట్‌’తో హరిత సందేశమిచ్చారు. ‘హరిత వృద్ధి’ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మోదీ సర్కారు.. ఇటీవలే రూ.19,700 కోట్లతో నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ను ప్రారంభించింది. కర్బన ఉద్గారాలను తగ్గించి హరిత ఇంధనంతో వృద్ధి సాధించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇక, ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్‌లోనూ తమ ఏడు ప్రాధాన్యాంశాల్లో ‘హరిత వృద్ధి’ని ఒకటిగా చేర్చిన ప్రభుత్వం.. ఇంధన పరివర్తన కోసం రూ.35వేల కోట్లు కేటాయించింది.

నేడు మోదీ ప్రసంగం..

ఇక, ప్రధాని మోదీ నేడు పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని నేడు లోక్‌సభలో సమాధానమివ్వనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన ప్రసంగించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని