Modi: అమెరికన్‌ కాంగ్రెస్‌లో ప్రసంగించనున్న ప్రధాని మోదీ

అధికారిక పర్యటనలో భాగంగా ఈ నెల 22న అమెరికన్‌ కాంగ్రెస్‌ సంయుక్త సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

Published : 02 Jun 2023 21:04 IST

వాషింగ్టన్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM modi) అమెరికన్‌ కాంగ్రెస్‌ (American Congress) సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు. ఈ మేరకు అమెరికన్‌ కాంగ్రెస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. అధికార పర్యటన నిమిత్తం మోదీ ఈ నెల 22న అమెరికా వెళ్లనున్న సంగతి తెలిసిందే. ‘‘ అమెరికన్‌ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, అమెరికా సెనేట్‌ను ఉద్దేశిస్తూ జూన్‌ 22న ప్రసంగించేందుకు భారత ప్రధాని మోదీని ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తున్నాం’’ అని అమెరికన్‌ కాంగ్రెస్ తన ప్రకటనలో పేర్కొంది. దీనిపై దిగువ సభ స్పీకర్‌ కెవిన్‌ మెకార్థీ, సేనేట్‌ తరఫు నేత చుక్‌ స్కుమెర్‌, సేనేట్‌ రిపబ్లికన్‌ నేత మిచ్‌ మెకోనెల్‌, హౌస్‌ డెమొక్రాటిక్‌ నేత హకీమ్‌ జఫ్రీస్‌ సంతకాలు చేశారు. అమెరికన్‌ కాంగ్రెస్‌ సంయుక్త సమావేశాల్లో మోదీ ప్రసంగించడం ఇది రెండోసారి.

మోదీ పర్యటన సందర్భంగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌లు డిన్నర్‌ను ఏర్పాటు చేయనున్నారు. సాంకేతికత, వాణిజ్యం, పరిశ్రమలు, రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాల గురించి ఈ పర్యటనలో ఇరు దేశాధినేతలూ చర్చించనున్నారు. దాంతోపాటు వివిధ రంగాల్లో బలమైన ద్వైపాక్షిక సహకారాన్ని కొనసాగించడంపైనా సమీక్షించనున్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను అడ్డుకునేందుకు బైడెన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, అమలు చేస్తున్న విధివిధానాలకు మద్దతుగా ప్రధాని మోదీ పర్యటన కొనసాగనుంది.

బైడెన్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 2021లో ప్రధాని మోదీ వైట్‌హౌస్‌లో ఆయన్ను కలిశారు. గత నెలలో ఆధునిక డిఫెన్స్‌, కంప్యూటింగ్ టెక్నాలజీతోపాటు జనరల్‌ ఎలక్ట్రిక్‌ జెట్‌ ఇంజిన్‌ తయారీకి సంబంధించి అవసరమైన సాంకేతికత అభివృద్ధికి ఇరు దేశాలూ కలిసి పనిచేస్తాయని సంయుక్తంగా ప్రకటించాయి. ప్రధాని మోదీ పర్యటన రెండు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని, స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని అమెరికా ప్రకటించింది. ‘‘ఈ పర్యటన ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భద్రతకు సంబంధించి రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు అంతరిక్షం, సాంకేతిక రంగాల్లో ఇరుదేశాల పరస్పర సహాకారాన్ని చాటి చెబుతుంది’’ అని శ్వేతసౌధం ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని