Agnipath: సాగు చట్టాల తరహాలోనే అగ్నిపథ్‌నూ ఉపసంహరించుకోవాలి: రాహుల్‌

సైనికుల నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని సైతం వెనక్కి తీసుకోక తప్పదని రాహుల్‌ అన్నారు....

Updated : 18 Jun 2022 11:22 IST

దిల్లీ: రైతుల సుదీర్ఘ నిరసనల అనంతరం సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తాజాగా గుర్తుచేశారు. అదే తరహాలో సైనికుల నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని సైతం వెనక్కి తీసుకోక తప్పదని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

‘‘వరుసగా 8 ఏళ్ల నుంచి భాజపా ప్రభుత్వం ‘జై జవాన్‌, జై కిసాన్‌’ విలువలను అవమానపరిచింది. నల్ల వ్యవసాయ చట్టాలను ప్రధానమంత్రి రద్దు చేసుకోకతప్పదని నేను గతంలో చెప్పాను. అదే తరహాలో తాజాగా ఆయన దేశ యువత నిర్ణయాన్నీ అంగీకరించాల్సిందే. క్షమాపణలు చెప్పి అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాల్సిందే’’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. అగ్నిపథ్‌లో చేరుతున్నవారిని ‘అగ్నివీర్‌’లని వ్యవహరిస్తున్నట్లుగా .. యువతకు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసిన రాహుల్‌ ఆయనను వ్యగ్యంగా ‘మాఫీవీర్‌’ అని సంబోధించారు. ‘మాఫీ’ అంటే హిందీలో ‘క్షమాపణ’ అని అర్థం.

సైనికుల నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా యువత విధ్వంస చర్యలకు పాల్పడింది. రైల్వే స్టేషన్లను కేంద్రంగా చేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్‌ సహా పలు రైల్వే స్టేషన్లలో రైళ్లకు నిప్పంటించారు. మరోవైపు అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు పలుచోట్ల కాల్పులు కూడా జరపడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని