PMGKAY: పీఎంజీకేఏవై పథకం కొనసాగించేలా కేంద్రం చర్యలు!: కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే

పీఎంజీకేఏవై ద్వారా పేదలకు అందిస్తున్న ఉచిత రేషన్‌ పంపిణీ డిసెంబరు 31 వరకు వర్తిస్తుంది. కొవిడ్ మళ్లీ కోరలు చాస్తున్న తరుణంలో ఈ పథకాన్ని మరింత కాలం పొడగించడంపై కేంద్రం శుక్రవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే అన్నారు.

Published : 22 Dec 2022 23:20 IST

దిల్లీ: పీఎంజీకేఏవై (ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన) (PMGKAY) పథకాన్ని కొనసాగించడంపై ప్రధాని నరేంద్రమోదీ (Modi) నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పేదలకు ఉచిత రేషన్‌ (Free Ration) అందించడానికి డిసెంబరు 31 వరకు వర్తించే ఈ పథకాన్ని పొడిగించాలని ప్రధాని యోచిస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే గురువారం తెలిపారు. 
ఈ విషయంపై ప్రధాని ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం కానున్న కేబినేట్‌ దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. గత సెప్టెంబరులో ప్రభుత్వం ఈ పథకాన్ని డిసెంబరు 31వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ‘‘ కొవిడ్‌ మళ్లీ విజృంభింస్తోంది. పీఎంజీకేఏవై పథకం డిసెంబరు వరకు అమలులో ఉంటుంది. డిసెంబరు తర్వాత ఈ పథకాన్ని కొనసాగించాలా? లేదా? అనే విషయంపై ప్రధాని శుక్రవారం నిర్ణయం తీసుకుంటారు’’ అని మంత్రి తెలిపారు.

‘‘గత 28 నెలల నుంచి కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచిత రేషన్‌ అందించడం కోసం రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద సరిపడా ధాన్యం నిల్వలు ఉన్నాయి. ఇవి ఆహార భద్రతా, సంక్షేమ ఫథకాల అవసరాలు తీర్చడానికి ఉపయోగపడతాయి. పశ్చిమబెంగాల్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌లలో కరవు, వాతావరణ మార్పుల వల్ల ధాన్యం, గోధుమల ఉత్పత్తి తగ్గుతుందనే అపోహ ఉంది. అయినప్పటికీ పీడీఎస్‌, సంక్షేమ పథకాల కోసం ఆహార ధాన్యాల సేకరణ సజావుగా సాగుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎటువంటి దోపిడీ జరగకుండా, ఆహార ధాన్యాలను వృథా చేయకుండా ఆధునిక సాంకేతికత సహాయంతో తగు చర్యలు తీసుకుంటున్నాం. సేకరించిన ధాన్యానికి మద్దతు ధరను ఇస్తున్నాం. నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులు వేస్తున్నాం. వచ్చే ఏడాది అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా చిరుధాన్యాల ఉత్పత్తి, ఎగుమతులను పెంచడంపై దృష్టి సారిస్తాం’’అని కేంద్రమంత్రి వివరించారు.
పీఎంజీకేఏవై పథకం 2020 ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. కరోనా వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో లాక్‌డౌన్‌ విధించడం వల్ల జీవనోపాధిని కోల్పోయిన పేదప్రజల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద 80 కోట్ల పేద ప్రజలకు ప్రతినెలా 5 కిలోల గోధుమలు, ధాన్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. డిసెంబరు 15 నాటికి కేంద్రం వద్ద 180 లక్షల టన్నుల గోధుమలు, 111 లక్షల టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయి. 2023 జనవరి 1 వరకు 138 లక్షల టన్నుల గోధుమలు, 76 లక్షల టన్నుల ధాన్యం అవసరం ఉంటుంది. 159 లక్షల టన్నుల గోధుమలు, 104 లక్షల టన్నుల ధాన్యం జనవరి 1 వరకు అందుబాటులో ఉంటాయని గతవారం ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని