PM Modi: అంబులెన్స్‌కు దారి.. నిలిచిన ప్రధాని మోదీ కాన్వాయ్‌..

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) హిమాచల్‌ ప్రదేశ్‌ పర్యటనలో ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

Published : 10 Nov 2022 01:20 IST

సిమ్లా: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) హిమాచల్‌ ప్రదేశ్‌ పర్యటనలో ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఆయన రోడ్డు మార్గంలో వెళ్తున్న సమయంలో ఓ అంబులెన్స్‌ వచ్చింది. దీంతో ప్రధాని తన కాన్వాయ్‌ని నిలిపివేశారు. ఆ అంబులెన్స్‌ వెళ్లిన తర్వాత ప్రధాని వాహన శ్రేణి ముందుకు కదిలింది. వాహనంలో కూర్చున్న మోదీ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను భాజపా తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌లో అంబులెన్స్‌కు దారిచ్చేందుకు ప్రధాని తన కాన్వాయ్‌ను నిలిపివేశారని.. విలువైన ప్రాణాల్ని కాపాడేందుకు ఎల్లప్పుడూ అంబులెన్స్‌కు దారి ఇవ్వండి అని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. 

ఇటీవల గుజరాత్‌ పర్యటనలోనూ ఇలాంటి సన్నివేశమే చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌ నుంచి గాంధీనగర్‌కు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తోన్న సమయంలో ఓ అంబులెన్స్‌ (Ambulance) రావడంతో ప్రధాని తన కాన్వాయ్‌ను రోడ్డు పక్కకు నిలిపివేసిన విషయం తెలిసిందే.

ఇంకోవైపు, హిమాచల్‌ప్రదేశ్‌లో శనివారం పోలింగ్‌ జరగనున్న వేళ అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న కాంగ్డా జిల్లాలో ప్రధాని మోదీ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సుజన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కేంద్రంలో గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు హిమాచల్‌ప్రదేశ్‌కు ద్రోహం చేసిందని, ఆ పార్టీ అభివృద్ధి వ్యతిరేక పార్టీ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే రాష్ట్ర ప్రగతి కుంటుపడుతుందని.. ఆ పార్టీతో రాజకీయ అస్థిరత, అవినీతి, కుంభకోణాలేనని ఆరోపించారు. భాజపాను మరోసారి గెలిపించి డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించి ప్రజలు చరిత్ర తిరగరాయాలని విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని