Rahul Gandhi: ఈడీ, సీబీఐలతో నన్ను భయపెట్టలేరు..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలకు తాను భయపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Published : 10 Feb 2022 19:03 IST

మోదీకి భయపడే ప్రసక్తే లేదన్న రాహుల్‌ గాంధీ

మంగ్లౌర్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలకు తాను భయపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అంతేకాకుండా మోదీ అహంకారం చూస్తుంటే హాస్యాస్పదంగా కనిపిస్తోందన్న ఆయన.. ఉత్తరాఖండ్‌లో అవినీతిపరులైన ముఖ్యమంత్రులను భాజపా మార్చుతోందని ఆరోపించారు. ‘ఒక దొంగ స్థానంలో మరో దొంగ’ను భాజపా కూర్చోబెట్టిందని రాహుల్ గాంధీ పరుష ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌ జిల్లాలోని మంగ్లౌర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ, ప్రధానమంత్రి తీరును ఎండగట్టారు.

‘ప్రధానమంత్రి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ప్రధాని మాట వినను అని చెప్పారు. ఆయన చెప్పింది నిజమే. ప్రధాని చెప్పింది నేను వినను. ఎందుకంటే, ఆయనతో పాటు సీబీఐ, ఈడీ వంటి సంస్థలకూ నేను భయపడను కాబట్టి’ అని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. ఇక దేశంలోని రైతులు, కాంగ్రెస్‌ పోరాటం కారణంగానే మూడు సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుందన్న ఆయన.. ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ ఒంటరిగానే పోరాటం చేయగలదని ధీమా వ్యక్తం చేశారు.

అంతేకాకుండా మోదీ ఆహంకారం హాస్యాస్పదంగా కనిపిస్తోందని రాహుల్‌ గాంధీ విమర్శించారు. గడిచిన 70ఏళ్లలో దేశంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని చెప్పడంలోనే అది వ్యక్తమవుతోందన్నారు. అంటే గత 70ఏళ్లుగా దేశం నిద్రపోతుందని ఆయన మాటలకు అర్థమా? ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశం మేల్కొందా..? అలాంటప్పుడు ఈ రోడ్ల నిర్మాణం, రైల్వే లైన్లు ఎవరు వేశారు. ఏదైనా మ్యాజిక్‌ జరిగిందా? అంటూ రాహుల్‌ గాంధీ వ్యంగ్యంగా ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని