Modi Russia visit: నవ బంధం

భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ల మధ్య మంగళవారం మాస్కోలో జరిగిన శిఖరాగ్ర సమావేశం రెండు దేశాల బంధంలో ‘నవ’ శకానికి నాంది పలికింది.

Updated : 10 Jul 2024 04:44 IST

విజయవంతమైన మోదీ రష్యా పర్యటన
9 కీలక రంగాల్లో మరింత ముందుకు సాగాలని భారత్, రష్యా నిర్ణయం
2030 నాటికి 100 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లక్ష్యం
మోదీ, పుతిన్‌ల శిఖరాగ్ర సదస్సులో అంగీకారం
బాంబులు, తుపాకులతో శాంతి చర్చలు సఫలం కావన్న ప్రధాని
యుద్ధంలో చిన్నారులు మరణించడం హృదయం ద్రవించేదే అని వ్యాఖ్య

మాస్కో, దిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ల మధ్య మంగళవారం మాస్కోలో జరిగిన శిఖరాగ్ర సమావేశం రెండు దేశాల బంధంలో ‘నవ’ శకానికి నాంది పలికింది. 9 కీలక రంగాల్లో సహకారానికి సరిహద్దుల్లేని ఒప్పందానికి బాటలు పరిచింది. 2030 నాటికి రెండు దేశాల మధ్య 100 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం లక్ష్యంగా నిర్ణయించింది. మరోవైపు మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారాన్ని పుతిన్‌ అందజేశారు. శిఖరాగ్ర చర్చల సందర్భంగా రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బాంబులు, తుపాకులు, బుల్లెట్లు శాంతి చర్చలను సఫలం చేయలేవని స్పష్టం చేశారు. అదే సమయంలో ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని పరిష్కరించడంలో సహకరిస్తున్న మోదీకి పుతిన్‌ కృతజ్ఞతలు తెలిపారు. 2 రోజుల రష్యా పర్యటనకు వచ్చిన మోదీ మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత పుతిన్‌తో కలిసి రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికుల స్మారక స్థూపానికి నివాళులర్పించారు. అణు ఇంధన మ్యూజియాన్ని సందర్శించారు. 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సుల్లో పుతిన్‌తో కలిసి చర్చలు జరిపారు. అనంతరం రెండు దేశాల తరఫున సంయుక్త ప్రకటన విడుదలైంది. 

సాగు నుంచి మౌలికం దాకా..

ప్రత్యేకమైన, గౌరవప్రదమైన వ్యూహాత్మక బంధాన్ని మరింత బలపరిచేలా సంబంధాలను కొనసాగించాలని శిఖరాగ్ర సదస్సులో ఇరు దేశాల అధినేతలు నిర్ణయించారు. వ్యవసాయం నుంచి మౌలిక వసతులదాకా మరింతగా సహకరించుకోవాలని అనుకున్నారు.   

అత్యున్నత పురస్కారం

రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత విస్తృత పరిచేందుకు కృషి చేస్తున్నందుకుగానూ ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూ ద అపోజల్‌’ను అధ్యక్షుడు పుతిన్‌ క్రెమ్లిన్‌లోని సెయింట్‌ ఆండ్రూ హాలులో ప్రదానం చేశారు. 2019లోనే దీనిని మోదీకి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. భారత్‌ నుంచి ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి నేతగా మోదీ రికార్డు సృష్టించారు. మొదటి అపోస్టిల్‌ ఆఫ్‌ జీసస్, పాట్రన్‌ సెయింట్‌ అయిన సెయింట్‌ ఆండ్రూ జ్ఞాపకార్థం దీనిని 1698లో ప్రారంభించారు. ఈ పురస్కారాన్ని భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. 

గర్జనలతో ఫలితం రాదు

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధానికి స్వస్తి పలికి శాంతి చర్చలు జరపాలని మోదీ పిలుపునిచ్చారు. బాంబు దాడులు, తుపాకీ కాల్పుల మధ్య శాంతి చర్చలు సఫలం కాబోవని తేల్చి చెప్పారు. భారత్‌ ఎప్పుడూ శాంతివైపే ఉంటుందని స్పష్టం చేశారు. భారత్, రష్యా ద్వైపాక్షిక బంధం సరికొత్త శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. యుద్ధంలో చిన్నారుల మరణాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని మోదీ వ్యాఖ్యానించారు. ‘ఉక్రెయిన్‌ యుద్ధం గురించి స్వేచ్ఛగా చర్చించుకోవడం సంతోషంగా ఉంది. దీనిపై పరస్పర అభిప్రాయాలను గౌరవించుకున్నాం. యుద్ధమైనా.. సంక్షోభమైనా, ఉగ్రచర్య అయినా.. ప్రాణనష్టం జరిగితే మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ బాధపడతారు. ఇక అభంశుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోవడాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఆ బాధ వర్ణించలేనిది’ అని పేర్కొన్నారు.  

శాంతియుత మార్గానికి కృతజ్ఞతలు

‘కీలక అంశాలపై మీరు చూపిన శ్రద్ధకు రుణపడి ఉంటా. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరించడానికి మీరు ప్రయత్నించడం అభినందనీయం. శాంతియుత మార్గాన్ని మీరు సూచించినందుకు కృతజ్ఞతలు’ అని మోదీతో పుతిన్‌ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది కజన్‌లో జరిగే బ్రిక్స్‌ సదస్సుకు రావాలని మోదీని ఆహ్వానించారు. అక్టోబరులో జరిగే బ్రిక్స్‌ సదస్సుకు తప్పకుండా వస్తానని ప్రధాని హామీ ఇచ్చారు. 

ఆస్ట్రియాకు చేరుకున్న ప్రధాని

రష్యా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ప్రధాని మోదీ మంగళవారం రాత్రి ఆస్ట్రియా రాజధాని వియన్నాకు చేరుకున్నారు. దాదాపు 40ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆ దేశంలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి.


9 కీలక రంగాలివే..

 • 2030 నాటికి వాణిజ్యాన్ని 100 బిలియన్‌ డాలర్లకు చేర్చడం. 
 • జాతీయ కరెన్సీల ద్వారా వాణిజ్యాన్ని స్థిరీకరించుకోవడం.
 • ఉత్తర, దక్షిణ కారిడార్‌వంటి కొత్త మార్గాల ద్వారా కార్గో సేవలను విస్తరించడం.
 • వ్యవసాయ, ఆహార, ఎరువుల రవాణాలో వృద్ధి సాధించడం.
 • అణు ఇంధనంతోపాటు ఇతర ఇంధన రంగాల్లో మరింత సహకారం.
 • మౌలిక వసతుల రంగంలో మరింతగా సహకరించుకోవడం.
 • డిజిటల్‌ ఆర్థిక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం, సంయుక్త ప్రాజెక్టులను చేపట్టడం.
 • ఔషధాల సరఫరాలో పరస్పర సహకారం.
 • మానవతా సాయంలో కలిసి పనిచేయడం.

మోదీ, పుతిన్‌ చర్చల్లో మరికొన్ని అంశాలు

 • చిన్న అణు విద్యుత్తు కేంద్రాల నిర్మాణానికి సహకరిస్తామని రష్యా హామీ ఇచ్చింది.
 • బంగ్లాదేశ్‌లో అణు విద్యుత్తు కేంద్రాల నిర్మాణానికి భారత్‌కు చెందిన కంపెనీల సహకారం.
 • ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందించడంలో రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయం. రహస్య ఎజెండాల్లేకుండా అంతర్జాతీయంగా సహకరించుకోవడం. పాకిస్థాన్‌ విషయంలో చైనా మాదిరిగా ద్వంద్వ విధానాలను అనుసరించకుండా వ్యవహరించడం. 
 • పుతిన్, మోదీ చర్చల సందర్భంగా భారత్, రష్యాలకు చెందిన పలు సంస్థలు ఒప్పందాలను కుదర్చుకున్నాయి. 
 • సైనిక సరఫరాల్లో జాప్యాన్ని నివారించడానికి భారత్‌తో కలిసి సంయుక్త సంస్థను ఏర్పాటు చేయడానికి రష్యా అంగీకారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు