Vande Bharat Express: ‘వందే భారత్‌ దేశ ప్రగతికి నిదర్శనం’.. మరో రైలుకు జెండా ఊపిన మోదీ

దేశంలో మరో వందే భారత్ రైలు(Vande Bharat Express) ప్రారంభమైంది. భోపాల్‌-దిల్లీ మధ్య నడిచే ఈ రైలును శనివారం ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. 

Published : 01 Apr 2023 21:25 IST

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ(Modi) శనివారం మరో వందే భారత్‌ రైలు(Vande Bharat Express)ను జెండా ఊపి ప్రారంభించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్-దిల్లీ(Bhopal-New Delhi ) మధ్య ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. ప్రధాని జెండా ఊపడంతో రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి ఇది ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్, రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..అభివృద్ధి చెందుతోన్న భారత్‌కు  వందే భారత్‌ రైలు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇది మనదేశ నైపుణ్యాలు, శక్తిసామర్థ్యాలను ప్రదర్శిస్తోందన్నారు. గత ప్రభుత్వాలు బుజ్జగింపు చర్యలు మాత్రమే చేపట్టాయని, తాము మాత్రం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే కట్టుబడి ఉన్నామని చెప్పారు.

భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో ఇది 11వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌(Vande Bharat Express). భారతీయ రైల్వేలో గంటకు 160కి.మీ వేగంతో నడిచే మొదటి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా ఇదే. 708 కిలోమీటర్ల దూరాన్ని7.45 గంటల్లో పూర్తిచేయగలదు. భారతీయ రైల్వే ఇప్పటి వరకు 10 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభించింది.  చాలా మార్గాల్లో వేగ పరిమితుల దృష్ట్యా అవి ఇప్పటి వరకు 130కి.మీ వేగంతో నడవడానికి  మాత్రమే అనుమతి ఉంది. 

ఈ కార్యక్రమంలో భాగంగా.. ఇందౌర్‌ ఆలయంలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా జరిగిన మెట్లబావి దుర్ఘటనపై మోదీ స్పందించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 36కు చేరింది. వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని