Hubballi: ప్రపంచంలోనే అతిపొడవైన రైల్వే ప్లాట్‌ఫాం!

ప్రపంచంలోనే అతిపొడవైన రైల్వే ప్లాట్‌ఫాం కలిగిన స్టేషన్‌గా హుబ్బళ్లి (Hubballi) రైల్వే స్టేషన్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు (Guinness Book of World Records)లో చోటు సంపాదించుకుంది.

Published : 13 Mar 2023 00:42 IST

హుబ్బళ్లి:  ప్రపంచంలోనే అతిపొడవైన రైల్వే ప్లాట్‌ఫాం కలిగిన స్టేషన్‌గా హుబ్బళ్లి(Hubballi)లోని శ్రీ సిద్ధారూఢ స్వామిజీ (Shree Siddharoodha Swamiji) రైల్వేస్టేషన్‌  రికార్డు సృష్టించింది.  గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు (Guinness Book of World Records)లో చోటు దక్కించుకుందని నైరుతి రైల్వే సౌత్‌ వెస్టర్న్‌ రైల్వే (SWR) జోన్‌ ప్రకటించింది.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హుబ్బళ్లీ రైల్వే ప్లాట్ ఫామ్‌లను ఆదివారం జాతికి అంకితం చేశారు. హుబ్బళ్లి రైల్వే యార్డ్‌ అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ స్టేషన్‌ను రూ.20 కోట్లతో ఆధునీకరించారు. 2021 ఫిబ్రవరిలో ఈ స్టేషన్‌ను ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ చేయడం ద్వారా స్టేషన్‌ ఆధునీకరణ పనులు ప్రారంభించారు.  శ్రీ సిద్ధారూఢ స్వామిజీ స్టేషన్‌ కర్ణాటక (Karnataka)లోని రైల్వే స్టేషన్లలో ముఖ్యమైనది. బెంగళూరు, హోస్‌పేట్‌, వాస్కోడగమా/బెళగావి రైల్వే లైన్లు కలిసే ప్రాంతంలో ఉంది. ఉత్తర కర్ణాటక ప్రాంతంతో వ్యాపార, వాణిజ్యానికి హుబ్బళ్లి ప్రధాన ప్రాంతం. 

ఈ రైల్వే స్టేషన్‌లో ఇప్పటి వరకు ఐదు ఫ్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. తాజాగా  మరో మూడు కొత్త ఫ్లాట్‌ఫామ్‌లను నిర్మించారు. కొత్తగా నిర్మించిన ఎనిమిదో ఫ్లాట్‌ఫామ్‌ 1507 మీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతి పొడవైన ఫ్లాట్‌ఫామ్‌గా రికార్డుకెక్కింది. దీని నిర్మాణంతో  హుబ్బళ్లి-ధార్వాడ  ప్రాంతంలో రవాణా అవసరాలు తీరనున్నాయి. ఈ ఫ్లాట్‌ఫామ్‌ల నిర్మాణంతో ఈ స్టేషన్‌లో మరిన్ని రైళ్లు ఆపడం వల్ల ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది.  దీంతోపాటు భారతీయ రైల్వే హోస్‌పేట్‌-హుబ్బళ్లి-తినాయ్‌ఘాట్‌ రైల్వే లైన్‌ను రూ. 519 కోట్లతో ఎలక్ట్రిక్‌ లైన్‌గా ఆధునీకరించారు. ఇది కర్ణాటకలో స్టీల్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్‌ను మోర్ముగో ఓడరేవుతో కలిపే ప్రధాన మార్గం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని