PM security breach: మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం.. దర్యాప్తునకు స్వతంత్ర కమిటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భారీ భద్రత వైఫల్యానికి సంబంధించి దాఖలైన అభ్యర్థనపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది.

Updated : 10 Jan 2022 14:51 IST

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భారీ భద్రత వైఫల్యానికి సంబంధించి దాఖలైన అభ్యర్థనపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ ఘటనపై స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది.

ఈ కమిటీలో పంజాబ్‌ నుంచి కూడా ప్రాతినిధ్యం ఉంటుందని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ వెల్లడించారు. ఇందులో చండీగఢ్‌ డీజీపీ, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఐజీ అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. కమిటీ ఏర్పాటుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌, పంజాబ్‌ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఆ రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ వెల్లడించారు.

గతవారం పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌ జిల్లాకు ప్రధాని మోదీ వెళుతుండగా ఆందోళనకారులు రహదారిని దిగ్బంధించడంతో ఆయన వాహనశ్రేణి 20 నిమిషాలపాటు ఫ్లైఓవర్‌పై చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన బహిరంగ సభ సహా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనకుండానే వెనుదిరిగారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ‘లాయర్స్‌ వాయిస్‌’ అనే సంస్థ వేసిన పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు కేంద్ర హోంశాఖ, పంజాబ్‌ ప్రభుత్వం వేసిన కమిటీలు తక్షణమే తమ దర్యాప్తులను నిలిపివేయాలని ఆదేశించింది. తాజాగా సోమవారం మరోసారి విచారణ జరిపిన న్యాయస్థానం.. ఘటనపై దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. కేంద్రం, పంజాబ్‌ ప్రభుత్వాలు వేసిన కమిటీల దర్యాప్తుపై స్టే అలాగే కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీనిపై పూర్తి వివరాలను త్వరలోనే జారీ చేస్తామని ధర్మాసనం వెల్లడించింది. 

భద్రతా వైఫల్యానికి బాధ్యత డీజీపీదే.. 

అంతకుముందు సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మోహతా కేంద్రం తరఫున వాదనలు వినిపించారు. పంజాబ్‌ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించినట్లు స్పష్టంగా తెలుస్తోందని ఎస్‌జీ కోర్టుకు తెలిపారు. ‘‘రోడ్డు మార్గంలో మోదీ పర్యటన ఆకస్మిక నిర్ణయం కాదు. ప్రణాళిక ప్రకారం జరిగిందే. ఇందుకోసం ప్రత్యామ్నాయ కాన్వాయ్‌ మార్గాన్ని కూడా సిద్ధం చేశారు. అలాంటప్పుడు ఆ మార్గంలో పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర అధికారులదే. రోడ్డు మార్గం క్లియర్‌గా ఉందని పంజాబ్‌ డీజీపీ.. స్పెషల్‌ ప్రొటెక్షన్ గ్రూప్‌ సిబ్బందికి చెప్పిన తర్వాత మోదీ కాన్వాయ్‌ బఠిండా ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరింది. కానీ మోదీ కాన్వాయ్‌ ఆందోళనకారులకు 100 మీటర్ల దూరంలో ఆగింది. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమే. ఎస్‌పీజీ చట్టం, బ్లూబుక్‌ నిబంధనలను పంజాబ్‌ అధికారులు ఉల్లంఘించారు. దీనికి ఆ రాష్ట్ర డీజీపీ, అధికారులు బాధ్యత వహించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమ అధికారులను సమర్థించడం ఆందోళనకరం’’ అని సొలిసిటర్‌ జనరల్ అన్నారు. 

దీనిపై జస్టిస్‌ హిమా కోహ్లీ స్పందిస్తూ.. ‘‘మీరు ఇప్పటికే పంజాబ్‌ అధికారులది తప్పని తేల్చి షోకాజ్‌ నోటీసులు ఇచ్చేశారు. అంటే మీకు ఎలా ముందుకెళ్లాలో తెలుసు. అలాంటప్పుడు కోర్టు వద్దకు ఎందుకు వచ్చారు’’ అని ఎస్‌జీని ప్రశ్నించారు. మరోవైపు కేంద్రం వాదనలను పంజాబ్‌ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ కేసుకు రాజకీయ రంగు పులిమేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించింది. అందుకే దీనిపై కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని కోరింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని