Independence Day: ప్రత్యేక అతిథులుగా ఒలింపిక్స్‌ క్రీడాకారుల బృందం

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారుల బృందానికి స్వదేశంలో అరుదైన గౌరవం దక్కనుంది. ఆగస్టు 15న దిల్లీలోని ఎర్రకోట వేదికగా నిర్వహించబోయే

Published : 03 Aug 2021 16:38 IST

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారుల బృందానికి స్వదేశంలో అరుదైన గౌరవం దక్కనుంది. ఈ నెల 15న దిల్లీలోని ఎర్రకోట వేదికగా నిర్వహించబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వారిని ప్రత్యేక అతిథులుగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించనున్నారు. ఈ మేరకు అధికార వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఆ సమయంలో వారందరినీ మోదీ వ్యక్తిగతంగా కలసి మాట్లాడనున్నట్టు అధికారులు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌ పురుషుల హాకీ సెమీఫైనల్స్‌లో బెల్జియం చేతిలో భారత జట్టు ఓటమిని చవిచూసింది. అయితే అంతర్జాతీయ వేదికపై వారి ప్రదర్శనను ప్రశంసిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. గెలుపు, ఓటములు మన జీవితంలో భాగమేనని అందులో పేర్కొన్నారు. హాకీ జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేసిందని కొనియాడారు. చాలా క్రీడల్లో భారతీయ క్రీడాకారులు తొలిసారిగా అర్హత సాధించినప్పటికీ అద్భుతమైన పోరాటపటిమను ప్రదర్శించారంటూ అభినందించారు. అత్యంత కఠిన సమయంలో వారు చూపిన ఆత్మవిశ్వాసం, నిబద్ధత చాలా గొప్పదంటూ ప్రశంసించారు. వారు భారత్‌కు సరికొత్త గుర్తింపును సాధించిపెట్టారని తెలిపారు. మన క్రీడాకారుల పట్ల భారత్‌ గర్విస్తోందన్నారు. తొలి సెమీస్‌లో ఓడినప్పటికీ కాంస్య పతకాన్నైనా దేశానికి కానుకగా ఇచ్చేందుకు భారత జట్టు రెండో సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా లేదా జర్మనీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటూ భారత జట్టుకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని