PM CARES: పీఎంకేర్స్‌ చిల్డ్రన్‌ స్కాలర్‌షిప్‌లు.. మే 30న ప్రారంభం

కొవిడ్‌ విజృంభణ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్‌ఫర్‌ చిల్డ్రన్‌ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Published : 29 May 2022 14:12 IST

పథకం ప్రయోజనాలను అందించనున్న ప్రధాని మోదీ

దిల్లీ: కొవిడ్‌ విజృంభణ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్‌ఫర్‌ చిల్డ్రన్‌ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పథకం ప్రయోజనాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 30న వీడియో కాన్ఫరెన్స్‌ కార్యక్రమం ద్వారా విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన పాస్‌బుక్‌తోపాటు ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌కార్డ్‌ను కూడా ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

దేశంలో కొవిడ్‌ విజృంభణ మొదలైన 11 మార్చి 2020 నుంచి 28 ఫిబ్రవరి 2022 మధ్యకాలంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత పిల్లలను ఆదుకునేందుకు పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ కార్యక్రమాన్ని 29 మే 2021న  కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. సమగ్ర రక్షణలో భాగంగా బాధిత పిల్లలకు వసతి కల్పించడం, విద్యా, స్కాలర్‌షిప్స్‌ అందించి వారికి మద్దతుగా నిలవడం, ఉన్నత చదువుల్లోనూ సహాయం చేయడం, 23ఏళ్ల వయసు వచ్చేనాటికి ఆర్థికంగా స్వయం సమృద్ధి చెందేలా రూ. 10లక్షల సహాయం అందించడంతోపాటు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కల్పించడం వంటి ప్రయోజనాలను ఈ పథకం ద్వారా అందించనున్నారు. ఇందులో నమోదు కోసం పీఎంకేర్స్‌ఫర్‌చిల్డ్రన్‌.ఇన్‌ పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇలా ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో ఆమోదం తెలిపిన వారికి ఈ పథకం ప్రయోజనాలను మే 30న బాధిత పిల్లలకు అందించే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని