PM Kisan: వచ్చే వారమే రైతుల ఖాతాల్లోకి.. పీఎం-కిసాన్‌ నిధులు

PM Kisan 17th installment: పీఎం కిసాన్‌ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌. జూన్‌ 18వ తేదీన ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.

Published : 15 Jun 2024 15:23 IST

దిల్లీ: రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం-కిసాన్‌ పథకం 17వ విడత నిధుల (PM Kisan 17th installment) విడుదలకు తేదీ ఖరారైంది. జూన్‌ 18న రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి (Varanasi) పర్యటనలో ప్రధాని మోదీ (PM Modi) ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈమేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ శనివారం వెల్లడించారు.

‘‘మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది. గత హయాంలోనూ రైతుల ప్రయోజనాల కోసం ప్రధాని అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం పీఎం-కిసాన్‌ (PM Kisan) నిధులకు సంబంధించిన దస్త్రంపైనే చేశారు’’ అని చౌహన్‌ తెలిపారు. ఈ పథకం ప్రారంభించిన నాటినుంచి ఇప్పటివరకు రూ.3.04 లక్షల కోట్లను అర్హులైన రైతులకు పెట్టుబడి సాయంగా అందించినట్లు పేర్కొన్నారు.

మోదీ ఈనెల 9వ తేదీన వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు పీఎంవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన.. వెంటనే ‘పీఎం కిసాన్‌’ 17వ వాయిదా చెల్లింపు దస్త్రంపై సంతకం చేశారు. 2018 నుంచి ఈ పథకం అమలుచేస్తున్నారు. దీనికింద అర్హులైన రైతులకు మూడు విడతల్లో రూ.2వేలు చొప్పున ఏటా రూ.6 వేలు పెట్టుబడి సాయంగా ఇస్తున్నారు. ఈ పథకంతో 9.3 కోట్ల మంది రైతులకు రూ.20వేల కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది.

మళ్లీ ‘మెలోడీ’ మూమెంట్‌.. మోదీ, మెలోనీ సెల్ఫీ వీడియో వైరల్‌

పేమెంట్‌ స్టేటస్ ఇలా..

పీఎం కిసాన్‌ (pmkisan.gov.in) వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి.. అందులో బెనిఫిషియరీ స్టేటస్‌ పేజీపై క్లిక్‌ చేయాలి. ప్రత్యేకంగా ఓపెన్‌ అయ్యే పేజీలో ఆధార్‌ లేదా అకౌంట్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. ‘గెట్‌ డేటా’ బటన్‌పై క్లిక్‌ చేయగానే పేమెంట్‌ వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ కేవైసీ చేయకపోతే నిధులు జమ కావు. కాబట్టి ఒకవేళ కేవైసీ పూర్తి చేయకుంటే అదే వెబ్‌సైట్‌లో ఇ-కేవైసీ బటన్‌ను క్లిక్‌ చేసి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

తొలిసారి వారణాసికి..

మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలిసారిగా తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. ఈనెల 18న అక్కడ సభలో పాల్గొననున్నారు. పీఎం-కిసాన్‌ నిధుల విడుదలతో పాటు ‘కృషి సఖీ’గా శిక్షణ పొందిన స్వయంసహాయక బృందాల మహిళలకు సర్టిఫికెట్లు అందజేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని