PMO Imposter Case: పీఎంవో ‘నకిలీ అధికారి’ కేసు.. రంగంలోకి సీబీఐ

PMO imposter case: పీఎంవో అధికారినంటూ ఓ కంటి ఆసుపత్రిపై బెదిరింపులకు పాల్పడిన మోసగాడు మయాంక్‌ అగర్వాల్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో తాజాగా సోదాలు చేపట్టింది.

Published : 19 Oct 2023 13:18 IST

దిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లో తానో ఉన్నతాధికారినని పేర్కొంటూ సెటిల్‌మెంట్‌ వ్యవహారానికి (PMO imposter case) దిగిన మోసగాడు మయాంక్‌ తివారీ (Maayank Tiwari) కేసులో సీబీఐ (CBI) దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. తాజాగా తివారీకి సంబంధించిన వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ కేసులో తివారీని ఇంకా అరెస్టు చేయలేదని తెలిపారు.

‘డాక్టర్‌ అగర్వాల్‌’ అనే కంటి ఆసుపత్రితో ఇందౌర్‌ (Indore)కు చెందిన ఓ ఆసుపత్రి గతంలో ఒప్పందం చేసుకుంది. అయితే, ఒప్పందం నిబంధనలను ఇందౌర్‌ ఆసుపత్రి ఉల్లంఘించడంతో డాక్టర్‌ అగర్వాల్‌ ఆ అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నారు. ఇది కాస్తా ఇరు వర్గాల మధ్య విభేదాలకు దారితీసింది. విషయం హైకోర్టు వరకు వెళ్లడంతో డాక్టర్‌ అగర్వాల్‌ ఆసుపత్రికి రూ.16.43 కోట్లు చెల్లించాలని ఇందౌర్‌ ఆసుపత్రిని కోర్టు ఆదేశించింది.

రైలు వంటగదిలో ఎలుకల స్వైర విహారం.. స్పందించిన ఐఆర్‌సీటీసీ

ఈ వివాదం సమయంలో.. మయాంక్‌ తివారీ నుంచి అగర్వాల్‌ ఆసుపత్రి ప్రమోటర్‌ అయిన డాక్టర్‌ అగర్వాల్‌కు వరుస మొబైల్‌ సందేశాలు వచ్చాయి. ఆ సొమ్మును ఇక మర్చిపోయి ఆ ఆసుపత్రితో పరిష్కారం కుదుర్చుకోవాలంటూ అందులో తివారీ బెదిరించాడు. ఈ సందర్భంగా తాను పీఎంవోలో ఉన్నతాధికారినంటూ పేర్కొన్నాడు. ఈ విషయం పీఎంవో కార్యాలయం దృష్టికి వెళ్లడంతో ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీబీఐని కోరింది. ఈ క్రమంలోనే సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

కాగా.. గుజరాత్‌కు చెందిన మయాంక్‌ అగర్వాల్‌ గతంలోనూ తాను పీఎంవో ఉన్నతాధికారినంటూ దిల్లీలోని ఓ స్కూల్‌ ట్రస్టీని మోసగించాడు. ఈ ఏడాది జూన్‌లో ఆ స్కూల్‌ నుంచి రెండు అడ్మిషన్లు తీసుకున్నాడు. ఆ కేసులో దిల్లీ పోలీసులు అతడిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని