Joshimath: ‘జోషీమఠ్‌’లో పరిస్థితిపై పీఎంవో సమీక్ష.. రేపు ఉత్తరాఖండ్‌కు కేంద్ర బృందం!

జోషీమఠ్‌లో పరిస్థితిపై పీఎంవో కార్యాలయం కీలక సమీక్ష నిర్వహించింది. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు సహాయం చేస్తున్నాయని.. ఇప్పటికే కొన్ని బలగాలు మోహరించినట్టు అధికారులు తెలిపారు.

Updated : 08 Jan 2023 20:46 IST

దిల్లీ: ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌(Joshimath)లో నెలకొన్న పరిస్థితిని ఎదుర్కొనేందుకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, నిపుణులు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి సహాయం చేస్తున్నారని పీఎంవో కార్యాలయం వెల్లడించింది. అక్కడి పరిస్థితిపై పీఎంవో కార్యాలయం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. వందలాది ఇళ్లకు పగుళ్లు ఏర్పడి భూమి కుంగిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి ఒక ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం, నాలుగు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకున్నాయని వెల్లడించారు. బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలిపారు. బోర్డర్‌ మేనేజ్‌మెంట్‌ కార్యదర్శి, నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ(NDMA) సభ్యులు అక్కడి పరిస్థితిని అంచనా వేసేందుకు సోమవారం ఉత్తరాఖండ్‌కు వెళ్తారని పేర్కొన్నారు.

ఎన్‌డీఎంఏ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, ఐఐటీ రూర్కీ, వడియా ఇన్‌స్టిట్యూట్‌ ‌ఆఫ్‌ హిమాలయన్‌ జియాలజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ అండ్‌ సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ల నిపుణులతో కూడిన బృందం అధ్యయనం చేసి సూచనలు ఇస్తుందని తెలిపారు.  ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య కార్యదర్శిగా ఉన్న పి.కె.మిశ్రా నిర్వహించిన సమావేశంలో ఉత్తరాఖండ్‌ సీఎస్‌ అక్కడి పరిస్థితిని పీఎంవోకు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో కేబినెట్‌ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారులు, ఎన్‌డీఎంఏ సభ్యులు పాల్గొన్నారు. 

ఎలాంటి రిస్క్‌ చేయొద్దు.. ప్రజలకు సీఎస్‌ విజ్ఞప్తి

ఇంకోవైపు, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు ఆదివారం  జోషీమఠ్‌ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఆయన వెంట డీజీపీ అశోక్‌ కుమార్‌, సీఎం కార్యదర్శి ఆర్‌ మీనాక్షి సుందరం తదితరులు ఉన్నారు. అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న మనోహర్ బాగ్, సింధర్, మార్వాడీ ప్రాంతాలను పరిశీలించిన సీఎస్‌.. తాత్కాలిక సహాయక కేంద్రాలకు తరలివెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో  ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని ప్రజలకు సూచించారు. నివాసితుల భద్రతే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమన్నారు. అందుకోసం యంత్రాంగం నిరంతరాయంగా పనిచేస్తోందని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని