Modi Foreign Trips: మోదీ విదేశీ పర్యటనలు.. ఐదేళ్లలో రూ.239కోట్లు ఖర్చు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల కోసం గత ఐదేళ్లలో రూ.239కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. అత్యధిక ఖర్చు అమెరికా పర్యటనకు కాగా.. అత్యల్పంగా జపాన్‌ పర్యటనకు అయినట్లు తెలిపింది.

Published : 09 Dec 2022 01:34 IST

దిల్లీ: ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ (Narendra Modi) విదేశాల్లో అధికారిక పర్యటనలు చేస్తుంటారు. ఈ క్రమంలో గత ఐదేళ్లలో ప్రధాని విదేశీ పర్యటనల (Foreign Trips) కోసం రూ.239కోట్లు ఖర్చయినట్లు వెల్లడైంది. గడిచిన ఐదేళ్లలో విదేశీ ప్రయాణాలు, వాటికైన ఖర్చులకు సంబంధించిన వివరాలను తెలపాలని సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్‌ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

‘వివిధ దేశాలతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవడంతోపాటు స్థానిక, అంతర్జాతీయ స్థాయిలో భారత కార్యకలాపాలను మరింత విస్తరించడమే ప్రధానమంత్రి విదేశీ పర్యటనల లక్ష్యం. దేశ ప్రయోజనాలతోపాటు విదేశాంగ విధాన లక్ష్యాలను చేరుకునేందుకు ఇటువంటి పర్యటనలు ఎంతో ముఖ్యం. అంతర్జాతీయ నేరాలు, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, సైబర్‌ సెక్యూరిటీతోపాటు ఇతర అంతర్జాతీయ అంశాలపై ప్రపంచ అజెండాను రూపొందించే ప్రయత్నంలో భాగంగా ప్రధానమంత్రి విదేశీ పర్యటనలు ఉంటాయి’ అని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వెల్లడించారు.

ఐదేళ్లలో మొత్తం 36 విదేశీ పర్యటనలు చేయగా అందులో 31 పర్యటనలకు బడ్జెట్‌ నుంచి ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నవంబర్‌ 2017లో ప్రధాని మోదీ తొలుత ఫిలిప్పైన్స్‌లో పర్యటించారు. 2021లో బంగ్లాదేశ్‌, అమెరికా, బ్రిటన్‌, ఇటలీ పర్యటనలు చేశారు. ఇలా మొత్తంగా ఇప్పటివరకు రూ.239కోట్లు ఖర్చు అయ్యిందని ప్రభుత్వం తెలిపింది. వీటిలో అత్యధికంగా అమెరికా పర్యటన కోసం రూ.23కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది (సెప్టెంబర్‌ 26-28) జపాన్‌ పర్యటనకు అత్యల్పంగా రూ.23లక్షలు ఖర్చయినట్లు పేర్కొంది. 2019 సెప్టెంబర్‌ 21 నుంచి 28 తేదీల్లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించిన సంగతి తెలసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని