Crime News: మూడు నెలల్లో ఏడుగురితో వివాహం.. ఒకే తరహా స్క్రిప్ట్‌తో కి‘లేడీ’ మోసం!

మాయమాటలు చెప్పి పెళ్లి ప్రతిపాదన.. మొదటి రాత్రే భర్తకు మత్తుమందు ఇవ్వడం.. డబ్బు, నగలతో మాయం......

Updated : 28 Mar 2022 05:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనాథలా తనను పరిచయం చేసుకోవడం.. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడం.. మొదటి రాత్రే భర్తకు మత్తుమందు ఇవ్వడం.. డబ్బు, నగలతో మాయమవ్వడం.. ఇదే స్క్రిప్ట్‌ను ఒకటి కాదు రెండు కాదు.. మూడు నెలల వ్యవధిలో 7 సార్లు ప్రయోగించింది ఆ యువతి. ఏడుగురు పెళ్లి కుమారులను మోసగించింది. చివరకు యువతితోపాటు ఆమె ముఠా సైతం పోలీసులకు చిక్కింది.

హరియాణాకు చెందిన ఓ యువతి పెళ్లికాని యువకులను, విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకోవాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకునేది. వారికి వలపు వల విసిరి పెళ్లి వరకు తీసుకెళ్లేది. వివాహం అయిన తర్వాత మొదటి రాత్రే భర్తకు మత్తుమందు మాత్రలు ఇచ్చి ఇంట్లో ఉన్న డబ్బు, నగలతో ఉడాయించేది. భర్తకు అనుమానం వచ్చేలోపే ముఠాతో కలిసి ప్రణాళికను అమలు చేసేది. ఈ పథకం అమలు కాకపోతే.. మరో మార్గం ఎన్నుకునేది. కట్నం వేధింపుల పేరుతో భర్తను బ్లాక్​మెయిల్​ చేసి డబ్బులు లాగేది. తనకు తల్లిదండ్రులు లేరని అందరినీ నమ్మించేది. ఇందుకు ఆమె ముఠా సభ్యులు సహకరించేవారు. ఈ గ్రూపులో ఓ మ్యారేజ్​ ఏజెంట్, నలుగురు పురుషులు సహా ముగ్గురు మహిళలు కూడా ఉంటడం గమనార్హం.

ఖేడీ కరమ్ శామ్లి ప్రాంతానికి చెందిన సతీష్​ను యువతి మొదటగా పెళ్లి చేసుకుంది. ఓ బిడ్డకు తండ్రి అయిన సతీష్ రెండో వివాహంగా ఆమెను వివాహమాడాడు. ఇక ఆమె రెండో పెళ్లి జనవరి 1న రాజస్థాన్​లో జరిగింది. ఫిబ్రవరి 15న మూడో వివాహం.. ఫిబ్రవరి 21న నాలుగో వివాహం రాజేందర్​తో జరిగింది. ఐదో వివాహం కుటానాకు చెందిన గౌరవ్​తో.. ఆరో వివాహం కర్నాల్​కు చెందిన సందీప్​తో జరిగింది. చివరగా మార్చి 26న బుద్వాకు చెందిన సుమిత్​తో ఆమెకు ఏడో పెళ్లి జరిగింది.

సదరు యువతిని వివాహం చేసుకున్న నాలుగో వ్యక్తి నౌల్తాకు చెందిన రాజేందర్ ఈ వ్యవహారంలో పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటకు వచ్చింది. తన వద్ద డబ్బులు, నగలతో ఆమె పారిపోవడంతో మోసపోయిన విషయాన్ని అతడు పోలీసులకు తెలియజేశాడు. మరోవైపు ఆమె ఐదో భర్తకు సంబంధించిన సమాచారం సేకరించి, తన పెళ్లి రిజిస్ట్రేషన్ పత్రాలతో ఆయన వద్దకు వెళ్లాడు. వారిద్దరూ ఆమె నిజస్వరూపాన్ని పసిగట్టేలోపే శనివారం ఏడో వివాహం కూడా జరిగిపోయింది. ఈ ఇరువురు ఇచ్చిన ఫిర్యాదుతో యువతిను, ఆమె సహచరుల్ని పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని