Wrestlers Protest: ఆందోళనకు దిగిన రెజ్లర్లపై కేసులు నమోదు

ఆందోళనకు దిగిన రెజ్లర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాల నిర్వహణ, ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం తదితర ఆరోపణలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Updated : 28 May 2023 23:11 IST

దిల్లీ: భారత పార్లమెంట్‌ నూతన భవనం (Parliament new Building) వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన రెజ్లర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాల నిర్వహణ, ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం తదితర ఆరోపణలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభం సమయంలో వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మాలిక్‌, బజ్‌రంగ్‌ పునియా తదితరులు తాము నిరసన చేపడుతున్న ప్రాంతం నుంచి  ర్యాలీగా బయల్దేరిన సంగతి తెలిసిందే. మహిళా అసెంబ్లీని నిర్వహించాలనే ఉద్దేశంతో వాళ్లంతా అటువైపు బయల్దేరి వెళ్లారు. అది గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. చివరికి బలవంతగా వాళ్లను బస్సుల్లోకి ఎక్కించి తీసుకెళ్లిపోయారు. తాజాగా వారిపై కేసులు నమోదు చేశారు.

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రెజ్లర్లు  గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం మహిళా సమ్మాన్‌ మహాపంచాయత్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో పోలీసులు పార్లమెంట్‌ భవనానికి రెండు కిలోమీటర్ల పరిధిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే, జంతర్‌ మంతర్‌ వద్ద భద్రతా బలగాలను భారీగా మోహరించారు.

పోలీసులు భారీగా భద్రతా బలగాలను మోహరించినప్పటికీ రెజ్లర్లు జాతీయ జెండాలు చేతపట్టుకొని పార్లమెంట్‌ వైపు మార్చ్‌ను కొనసాగిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వినేష్‌ ఫొగాట్‌, సంగీతా ఫొగాట్‌ తదితరులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు అథ్లెట్లు కిందపడిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని