Amitabh-Anushka: అమితాబ్‌-అనుష్కకు లిఫ్ట్‌ ఇచ్చిన బైకర్లకు జరిమానా

బాలీవుడ్ నటులు అమితాబ్‌ బచ్చన్‌(Amitabh Bachchan), అనుష్క శర్మ(Anushka Sharma)కు లిఫ్ట్ ఇచ్చిన ఇద్దరు బైకర్లకు ముంబయి పోలీసులు జరిమానా విధించారు. బండి నడిపిన ఆ ఇద్దరు వ్యక్తులు హెల్మెట్లు పెట్టుకోకపోవడమే అందుకు కారణం. 

Updated : 17 May 2023 20:48 IST

ముంబయి: ట్రాఫిక్‌ నుంచి తప్పించుకునేందుకు బాలీవుడ్ స్టార్స్‌ అమితాబ్‌ బచ్చన్‌((Amitabh Bachchan), అనుష్క శర్మ(Anushka Sharma) ఇటీవల కారు వదిలి బైక్‌పై ప్రయాణించారు. వేగంగా గమ్యస్థానాలను చేరుకునేందుకు వేర్వేరు సందర్భాల్లో వారు ఇతరుల బైక్‌ను ఆశ్రయించారు. అయితే వారికి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తులు హెల్మెట్లు(helmets) ధరించకపోవడం ముంబయి పోలీసుల దృష్టికి చేరింది. దాంతో ట్రాఫిక్ విభాగం జరిమానాలు విధించింది. 

ఇటీవల అమితాబ్(Amitabh Bachchan) ఓ సామాన్యుడి బైక్‌పై షూటింగ్‌ స్థలానికి వెళ్తూ ముంబయి వీధుల్లో కనిపించారు. తనకు లిఫ్ట్‌ ఇచ్చిన వ్యక్తికి థ్యాంక్స్‌ చెప్పారు. ‘‘నువ్వు ఎవరో నాకు తెలీదు.. కానీ సమయానికి నన్ను షూటింగ్‌ జరిగే ప్రదేశానికి తీసుకెళ్లావు. ట్రాఫిక్‌లో చిక్కుకుపోకుండా సాయం చేశావు’’ అంటూ అతడికి ధన్యవాదాలు చెప్పారు. ఇదే విధంగా అనుష్క(Anushka Sharma) కూడా కారులో స్టూడియోకు వెళ్తుంటే.. చెట్టు పడిపోవడం వల్ల దారంతా ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో ఆమె కూడా ఓ వ్యక్తి బండి మీద స్టూడియోకు చేరుకున్నారు. పనిపట్ల వీరికున్న నిబద్ధతను కొందరు ప్రశంసించగా.. మరికొందరు మాత్రం హెల్మెట్లు ధరించలేదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ముంబయి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. ఈ విషయాన్ని ట్రాఫిక్ విభాగానికి తెలియజేస్తామని చెప్పారు.

ఇప్పుడు ముంబయి ట్రాఫిక్‌ పోలీసు విభాగం.. ఆ బైకర్లకు జారీ చేసిన చలాన్లను ట్విటర్ వేదికగా షేర్‌ చేసింది. అనుష్కకు లిఫ్ట్‌ ఇచ్చిన వ్యక్తికి రూ.10,500 చలానా విధించింది. అమితాబ్‌ను తీసుకెళ్లిన వ్యక్తిపై జరిమానా పడింది. అయితే ఆ మొత్తంపై స్పష్టత లేదు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని