Manish Sisodia: సిసోదియాను లాక్కెళ్లిన పోలీసులు.. వీడియో బయటపెట్టిన ఆప్‌

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా (Manish Sisodia)పై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన వీడియో ఒకటి తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై ఆప్‌ నేతలు మండిపడుతున్నారు.

Updated : 23 May 2023 15:26 IST

దిల్లీ: మద్యం కుంభకోణం (Excise Scam) కేసులో అరెస్టయిన దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా (Manish Sisodia)తో పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) సహా ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) నేతలు ఆరోపించారు. ఈ మేరకు సిసోదియాను పోలీసులు లాక్కెళ్తున్నట్లుగా ఉన్న ఓ వీడియోను పోస్ట్‌ చేసిన ఆప్‌.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తింది. అసలేం జరిగిందంటే..

మద్యం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో సిసోదియా (Manish Sisodia) కస్టడీ మంగళవారంతో ముగియడంతో దిల్లీ పోలీసులు ఆయన్ను నేడు కోర్టులో హాజరుపర్చారు. కోర్టు గది నుంచి సిసోదియాను బయటకు తీసుకొస్తుండగా మీడియా ఆయనను చుట్టుముట్టింది. దిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై నియంత్రణాధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అడ్డుకునేందుకు కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్‌ గురించి విలేకరులు సిసోదియాను అడగ్గా.. ‘‘మోదీజీ చాలా అహంకారిగా మారారు. ఆయనకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు’’ అని ఆప్‌ (AAP) నేత బదులిచ్చారు.

అయితే, సిసోదియాను ప్రశ్నిస్తుండగా ఓ పోలీసు అధికారి.. విలేకర్ల ఫోన్లను తోసేశారు. ఆ తర్వాత ఆప్‌ నేతపై మెడ చుట్టూ చేయి వేసి బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ‘‘రౌస్‌ అవెన్యూ కోర్టులో సిసోదియా (Manish Sisodia)తో ఓ పోలీసు అధికారి దురుసుగా ప్రవర్తించారు. ఆయనను వెంటనే సస్పెండ్‌ చేయాలని’’ అని దిల్లీ మంత్రి అతిషి డిమాండ్‌ చేశారు. ఈ వీడియోపై కేజ్రీవాల్‌  (Arvind Kejriwal) స్పందిస్తూ.. ‘‘మనీశ్‌జీతో ఇలా దురుసుగా ప్రవర్తించే అధికారం పోలీసులకు ఉందా? లేదంటే ఇలా చేయమని పోలీసులను ఎవరైనా ఆదేశిస్తున్నారా?’’ అంటూ కేంద్రంపై పరోక్షంగా మండిపడ్డారు.

అయితే ఈ ఆరోపణలను దిల్లీ పోలీసులు ఖండించారు. ‘‘ఆయనకు భద్రత కల్పించడంలో భాగంగానే పోలీసులు అలా ప్రవర్తించారు. అంతేగాక, నిందితులు మీడియాకు స్టేట్‌మెంట్లు ఇవ్వడం చట్టపరంగా వ్యతిరేకం’’ అని దిల్లీ పోలీస్‌ విభాగం ట్వీట్‌ చేసింది. కాగా.. మద్యం కుంభకోణం కేసులో సిసోదియా కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. జూన్‌ 1వ తేదీ వరకు ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలోనే ఉండాలని స్పష్టం చేసింది. అయితే జైల్లో ఆయనకు కుర్చీ, టేబుల్‌, పుస్తకాలు అందించాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.

జైన్‌ ఫొటోపై దిగ్భ్రాంతి..

ఇక, మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయి తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఆయన ఫొటో ఒకటి బయటికొచ్చింది. అందులో జైన్‌ బలహీనంగా, బక్కచిక్కిపోయి కన్పించారు. ఈ ఫొటోను షేర్‌ చేసిన కేజ్రీవాల్‌.. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘జైన్‌ త్వరగా కోలుకోవాలి. భాజపా అహంకారాన్ని, దౌర్జన్యాలను దిల్లీ ప్రజలంతా చూస్తున్నారు. ఈ అణచివేతదారులను దేవుడు కూడా క్షమించడు. ఈ పోరాటంలో మాకు ప్రజలు, భగవంతుడు అండగా ఉన్నారు. మేం భగత్‌సింగ్‌ అనుచరులం. అన్యాయం, నియంతృత్వంపై మా పోరాటం కొనసాగుతుంది’’ అని కేజ్రీవాల్‌ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. సత్యేందర్‌ జైన్‌ను జైల్లోనే చంపేసేందుకు భాజపా కుట్రలు పన్నుతోందని ఆప్‌ నేతలు ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని