బీఎస్‌ఎఫ్‌ పరిధి పెంపు.. సమాఖ్య సూత్రాల ఉల్లంఘనే: పంజాబ్‌ అఖిలపక్షం తీర్మానం

రాష్ట్రంలో సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) అధికార పరిధి పెంపును తిరస్కరిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పంజాబ్‌ రాష్ట్ర అఖిలపక్షం ఆమోదించింది. ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆధ్వర్యంలో సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. భాజపా మినహా...

Published : 25 Oct 2021 22:18 IST

చండీగఢ్‌: రాష్ట్రంలో సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) అధికార పరిధి పెంపును తిరస్కరిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పంజాబ్‌ రాష్ట్ర అఖిలపక్షం ఆమోదించింది. ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆధ్వర్యంలో సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. భాజపా మినహా శిరోమణి అకాలీదళ్‌, ఆప్‌ తదితర అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా సీఎం చన్నీతోపాటు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర నిర్ణయం సమాఖ్య సూత్రాలను ఉల్లంఘించడం లాంటిదేనని సీఎం విమర్శించారు. ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ కోరినప్పటికీ.. స్పందన రాలేదని ఆరోపించారు. ఈ క్రమంలో 10-15 రోజుల్లో రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని, సుప్రీం కోర్టునూ ఆశ్రయిస్తామన్నారు. దీంతోపాటు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి తీర్మానం చేస్తామని స్పష్టం చేశారు.

‘ముఖ్యమంత్రుల చేతులు విరిచేస్తోంది’

కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర పోలీసులు, బీఎస్ఎఫ్ మధ్య సమన్వయానికి బదులుగా రాష్ట్ర పోలీసు వ్యవస్థనే దెబ్బతీస్తోందని సిద్ధూ ఆరోపించారు. రాష్ట్రంలోనే ఇంకో రాష్ట్రాన్ని సృష్టిస్తూ.. సమాఖ్య విధానాన్ని బలహీనం చేస్తోందన్నారు. ‘ఇది ఒక రాజకీయ క్రీడ. అసలు ఇందులో రాష్ట్ర అభిప్రాయాలను ఎక్కడ పరిగణనలోకి తీసుకుందని?’ అని ప్రశ్నించారు. కేంద్ర సంస్థలకు రాజకీయ రంగు పులుముతోందని, ముఖ్యమంత్రుల చేతులను విరిచేస్తోందని ఆరోపించారు. బీఎస్‌ఎఫ్‌ పరిధి పెంపు నిర్ణయాన్ని స్వాగతించిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై కూడ సిద్ధూ విమర్శలు చేశారు. కేంద్రం చెప్పినట్లుగా నడచుకుంటున్నారని ఆరోపించారు.

‘మా సరిహద్దులు ప్రశాంతంగానే ఉన్నాయి’

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఈ విషయమై స్పందించారు. సోమవారం సిలిగుడీలో మాట్లాడుతూ.. ‘పంజాబ్ మాదిరిగానే మేం కూడా కేంద్ర నిర్ణయంపై నిరసన తెలియజేస్తున్నాం. మా సరిహద్దు ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర పోలీసులకు సంబంధించిన విషయం. కేంద్రం తీరు కలవరం సృష్టిస్తోంది’ అని అన్నారు. పంజాబ్‌, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో బీఎస్‌ఎఫ్‌ సిబ్బందికి ఇదివరకు సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల లోపల వరకు మాత్రమే సోదాలు, జప్తులు, అనుమానిత వ్యక్తులను అరెస్టు చేసే అధికారాలు ఉండేవి. కానీ..  ఇటీవల ఈ పరిధిని 50 కిలోమీటర్ల వరకు పెంచుతూ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని