Updated : 30 Sep 2021 20:00 IST

ByPolls: ఓటేసిన దీదీ.. 4చోట్ల ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతం!

కోల్‌కతా/భువనేశ్వర్‌: పశ్చిమబెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్‌ నియోజకవర్గంలో సాయంత్రం 5గంటల సమయానికి 53.32శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. అలాగే, షంషేర్‌గంజ్‌ స్థానంలో 78.60శాతం పోలింగ్‌ నమోదు కాగా.. జంగీపూర్‌లో 76.12శాతం పోలింగ్‌ నమోదైనట్టు పేర్కొన్నారు. మరోవైపు, ఒడిశాలోని పూరీ జిల్లా పిప్లీ నియోజకవర్గంలో 68.40శాతం పోలింగ్‌ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎస్కే లోహాని తెలిపారు. బెంగాల్‌లోని మూడు నియోజకవర్గాల్లో 6,97,164మంది ఓటర్లు ఉండగా.. పిప్లీలో 2.3లక్షల మందికి పైగా ఉన్నారు. సీఎం మమతా బెనర్జీ మిత్రా ఇన్‌స్టిట్యూషన్‌ స్కూల్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

తృణమూల్‌, భాజపా పరస్పర ఫిర్యాదులు 

భవానీపూర్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ బరిలో నిలవగా.. భాజపా నుంచి ప్రియాంక టిబ్రేవాల్‌, సీపీఎం నుంచి శ్రీజిబ్‌ విశ్వాస్‌ పోటీలో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా టీఎంసీ, భాజపా అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ శ్రేణులు వార్డు నంబర్‌ 72లోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఓటింగ్ ప్రక్రియను బలవంతంగా అడ్డుకున్నట్టు భాజపా అభ్యర్థి ప్రియాంక ఆరోపించారు. మంత్రి ఫిర్హాద్‌ హకీం, సుబ్రతా ముఖర్జీలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే, అవన్నీ నిరాధార ఆరోపణలేనని మంత్రి హకీమ్‌ కొట్టిపారేశారు. ఓడిపోతామని తెలిసే భాజపా ఇలాంటి ఆరోపణలు చేస్తోందన్నారు. అలాగే, భవానీపూర్‌లోని ఓ పోలింగ్‌ బూత్‌ బయట భాజపా, టీఎంసీ మద్దతుదారులకు స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. అధికార టీఎంసీ నకిలీ ఓటర్లను పోలింగ్‌ కేంద్రంలోకి తీసుకొస్తోందని భాజపా ఆరోపించడం స్వల్ప ఘర్షణకు దారితీయగా.. భద్రతా బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. మరోవైపు, తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా భాజపా అభ్యర్థి ప్రియాంకపై ఈసీకి ఫిర్యాదు చేసింది. టిబ్రేవాల్‌ తన పరివారంతో 20 కార్లలో తిరుగుతూ ఓటర్లను భయపెట్టారని టీఎంసీ నేతలు ఆరోపించగా.. వాటిని ఆమె తోసిపుచ్చారు. 

అక్టోబర్‌ 3న ఫలితాలు

ఇకపోతే, ఒడిశాలోని పిప్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల పోలింగ్‌లోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని ఎన్నికల అధికారి తెలిపారు. కొవిడ్‌ నిబంధనలతో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ఉదయం పోలింగ్‌ ప్రారంభానికి ముందు 348 పోలింగ్‌ బూత్‌లలో మాక్‌ పోలింగ్ జరిగిందని తెలిపారు. ఈవీఎంలు మొరాయించడంతో పలుచోట్ల పోలింగ్‌ ఆలస్యమైందని వివరించారు. 2000మందితో భద్రత ఏర్పాటు చేసినట్టు చెప్పారు.ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్‌ 3న వెల్లడి కానున్నాయి.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని