Adar Poonawalla: విదేశాలు వెళ్లే విద్యార్థులకు పూనావాలా సాయం

విదేశాలకు వెళ్తున్న భారత విద్యార్థుల కోసం సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా రూ.10 కోట్లు పక్కనపెట్టారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. అసలు విషయం ఏంటంటే..

Updated : 05 Aug 2021 22:32 IST

దిల్లీ: విదేశాలకు వెళ్తున్న భారత విద్యార్థుల కోసం సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా రూ.10 కోట్లు పక్కనపెట్టారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. అసలు విషయం ఏంటంటే.. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కరోనా టీకాను స్థానికంగా సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. అదే కొవిషీల్డ్. ప్రస్తుతం దేశంలో కరోనా టీకా కార్యక్రమం కింద దీన్ని అర్హులందరికీ అందిస్తున్నారు. వారిలో విదేశాలకు వెళ్లే విద్యార్థులు కూడా ఉన్నారు. పూర్తిగా టీకా తీసుకుంటే ఎటువంటి క్వారంటైన్‌ నిబంధనలు లేకుండా విద్యార్థులు వచ్చేందుకు విదేశాలు అనుమతిస్తున్నాయి.

అయితే కొన్ని దేశాలు తాము ఆమోదించిన జాబితాలో కొవిషీల్డ్‌ను చేర్చకపోవడంతో భారత విద్యార్థులు ఇబ్బందిపడాల్సి వస్తోంది. దాంతో వారికి ఆర్థికంగా సహకరించేందుకు అదర్ పూనావాలా ముందుకొచ్చారు. రూ.10 కోట్లు కేటాయించారు. ‘విదేశాలకు వెళ్లే భారత విద్యార్థులారా.. కొన్ని దేశాలు కొవిషీల్డ్‌ను ప్రయాణానికి ఆమోదయోగ్యమైన టీకాగా తమ జాబితాలో చేర్చనందున క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. దాంతో మీరు కొంత ఖర్చు పెట్టాల్సి రావొచ్చు. అందుకోసమే నేను రూ.10 కోట్లు కేటాయించాను’ అని పూనావాలా ట్వీట్ చేశారు. ఆర్థిక సహాయం అవసరమైన వారు  సంప్రదించాల్సిన లింక్‌ను షేర్ చేశారు. ఇదిలా ఉండగా.. కొవిషీల్డ్ టీకా తీసుకున్న వ్యక్తులు ఎటువంటి నిబంధనలు లేకుండా తమ దేశంలోకి ప్రవేశించేందుకు 16 ఐరోపా దేశాలు అనుమతించడంపై గతంలో పూనావాలా ఆనందం వ్యక్తం చేశారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని