భారత వైద్యసిబ్బంది సేవలపై పోప్‌ ప్రశంసలు

కరోనా వైరస్‌ మహమ్మారి విలయంతో వణికిపోతోన్న భారత్‌లో వైద్య సిబ్బంది చేస్తోన్న అవిశ్రాంత సేవలను పోప్‌ ఫ్రాన్సిస్‌ కొనియాడారు.

Published : 06 May 2021 22:08 IST

వాటికన్‌ సిటీ: కరోనా వైరస్‌ మహమ్మారి విలయంతో వణికిపోతున్న భారత్‌లో వైద్య సిబ్బంది చేస్తున్న అవిశ్రాంత సేవలను పోప్‌ ఫ్రాన్సిస్‌ కొనియాడారు. విపత్కర సమయంలో వారికి మరింత బలాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నానని తెలిపారు. భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. భారత ప్రజలకు సంఘీభావాన్ని తెలుపుతూ ఇక్కడి కాథలిక్‌ బిషప్స్‌ సంఘాలకు పోప్‌ ఫ్రాన్సిస్‌ ఓ సందేశాన్ని పంపించారు. కరోనా విజృంభణతో ఏర్పడ్డ పరిస్థితుల్లో అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఎంతో మంది వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది, అంబులెన్స్‌ డ్రైవర్ల కృషిని ప్రశంసిస్తున్నానని తెలిపారు. వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్న బాధితులు తొందరగా కోలుకోవాలని ప్రార్థించిన పోప్‌.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నానని అన్నారు.

దేశంలో సెకండ్‌ వేవ్‌ ధాటికి నిత్యం 4లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. దాదాపు 4వేల మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోతుండడం పరిస్థితికి అద్ధం పడుతోంది. ఈ నేపథ్యంలో మహమ్మారిపై భారత్‌ చేస్తున్న పోరుకు మద్దతు పలుకుతున్న ప్రపంచ దేశాలు.. వివిధ రూపాల్లో సహాయ, సహకారాలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని