Updated : 02 Jun 2021 20:30 IST

Corona: ఉపశమనం ఇచ్చే ‘పాజిటివ్‌’ న్యూస్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు తగ్గుతుండగా.. రికవరీలు పెరుగుతున్నాయి. మరణాలు సైతం తగ్గుముఖం పడుతుండటం ఊరటనిస్తోంది. కరోనాపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండటంతో పాటు పలు సంస్థలు, వ్యక్తులు ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఈ మహమ్మారి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకొంటున్నాయి. కరోనా కష్టకాలంలో ఇలాంటి కొన్ని పాజిటివ్‌ వార్తలు మీకోసం.. 

* దేశంలో కరోనా వైరస్‌ కొత్త కేసుల తగ్గుదల ట్రెండ్‌ కొనసాగుతోంది. వరుసగా తొమ్మిదో రోజూ పాజిటివిటీ రేటు దిగివచ్చింది. ఇది బుధవారం కూడా 10శాతం కన్నా తక్కువ (6.57శాతం)గానే నమోదైంది. మరోవైపు, యాక్టివ్‌ కేసుల కొండ కరుగుతోంది. నిన్న ఒక్కరోజే యాక్టివ్‌ కేసుల్లో 1,01,875 తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం దేశంలో 17.93లక్షల క్రియాశీల కేసులు ఉండగా.. రికవరీ రేటు 92.48శాతంగా ఉంది.

* కరోనా వైరస్‌పై సమష్టి పోరుకు టీకాలపై మేధో హక్కులను తాత్కాలికంగా రద్దు చేయాలన్న భారత్, దక్షిణాఫ్రికాల ప్రతిపాదనకు 5 దేశాలతో కూడిన బ్రిక్స్‌ మద్దతిచ్చింది. ప్రపంచ దేశాలన్నిటికీ టీకాలను సమంగా అందుబాటులోకి తీసుకురావాలని, వ్యాక్సిన్ల పంపిణీ, ధరల విధానంలోనూ పారదర్శకత ఉండాలని ఆ ప్రతిపాదన సారాంశం. కరోనా సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవడంపై బ్రిక్స్‌ సమావేశం విస్తృతంగా చర్చించింది. ఆతిథ్య దేశ హోదాలో ఈ భేటీకి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ అధ్యక్షత వహించారు.

* కరోనా సెకండ్‌ వేవ్‌ గ్రామాలపైనా తీవ్ర ప్రభావం చూపడంతో మహారాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ‘కరోనా ఫ్రీ విలేజ్‌’ పేరిట ఓ పోటీని ప్రకటించింది. దీంట్లో భాగంగా కరోనా నియంత్రణలో విశేష పనితీరు కనబరిచిన గ్రామ పంచాయతీలకు నగదు బహుమతులు ఇవ్వనున్నారు. ఒక్క రెవెన్యూ డివిజన్‌లో మూడు గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి మొదటి బహుమతి కింద రూ.50లక్షలు, రెండో బహుమతికి రూ.25లక్షలు, మూడో బహుమతి కింద రూ.15లక్షల చొప్పున ఇవ్వనున్నారు. 

* నాడి పట్టుకోకుండానే రూ.500 నుంచి 1500 వరకు కన్సల్టెన్సీ ఫీజు వసూలు చేసే ప్రైవేటు ఆస్పత్రులు ఉన్న ఈ రోజుల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యుడు ప్రత్యేకంగా నిలుస్తున్నారు. నగరంలోని పీర్జాదిగూడకు చెందిన డాక్టర్‌ విక్టర్‌ ఇమ్మాన్యుయేల్‌ రూ.10లకే తన క్లినిక్‌లో వైద్యం అందించి పేదలకు బాసటగా నిలుస్తున్నారు. నిరుపేదలు, రైతులు, స్వాతంత్ర్య సమరయోధులు, అనాథలు, యాసిడ్‌ బాధితులకు తక్కువ ధరకే చికిత్స అందిస్తూ గొప్ప మానవతావాదిగా నిలుస్తున్నారు. కొవిడ్ కష్టకాలంలోనూ ఆయన తన సేవలు కొనసాగిస్తూనే ఉన్నారు. అంతేకాదు, ఔషధాల్లో 10 శాతం రాయితీ, వైద్య పరీక్షల్లో 30శాతం రాయితీ ఇవ్వడం విశేషం. 

* రాష్ట్రాలకు ఉచితంగానే టీకాలు పంపిణీ చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ కేరళ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తీర్మానానికి సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అలాగే, కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా టీకాలు సమకూర్చాలని పశ్చిమ్‌బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కొవిడ్ ముప్పు నుంచి రక్షించుకొనేందుకు వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ అన్నారు. రాష్ట్రాలకు కావాల్సిన వ్యాక్సిన్లను కేంద్రమే కొనుగోలు చేసి పంపిణీ చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బుధవారం లేఖ రాశారు.

* కరోనాతో నెలకొన్న తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకొని సీబీఎస్‌ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల్ని కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణపై తల్లిదండ్రుల్లో ఆందోళనలు వ్యక్తమవుతుండటంతో పలు రాష్ట్రాలు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ బోర్డు 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. అలాగే, గుజరాత్, ఉత్తరాఖండ్‌ కూడా 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. మహారాష్ట్ర సైతం ఈ పరీక్షలకు సంబంధించిన ప్రతిపాదనలను విపత్తు నిర్వహణ అథారిటీకి పంపింది. ఒకట్రెండు రోజుల్లో ఆ సంస్థ సమీక్షించి నిర్ణయం తీసుకుంటుందని విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్‌ తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతే తమకు ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు. 

* కొవిడ్‌ నేపథ్యంలో చంటిపిల్లల తల్లులైన ఉద్యోగినులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం అవకాశం కల్పించేలా ప్రోత్సహించాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. బిడ్డ పుట్టినప్పటి నుంచి కనీసం ఏడాది పాటు దీన్ని అమలు చేయాలని కోరింది. 

* అల్లం, వెల్లుల్లి తినడం ద్వారా కరోనా సంక్రమణను నివారించవచ్చంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్రం స్పందించింది. ఇవి తింటే కరోనా ఇన్‌ఫెక్షన్‌ నిరోధిస్తుందనే అంశాన్ని నిరూపించేందుకు శాస్త్రీయ ఆధారాలేమీ లేవని ఐసీఎంఆర్‌ స్పష్టంచేసింది. అయితే, అల్లం, వెల్లుల్లి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయని పేర్కొంది. 

* కరోనాపై పోరులో పలు సంస్థలు తమ సహకారాన్ని అందిస్తూ భారత్‌కు అండగా నిలుస్తున్నాయి. అశోక్‌ లేలాండ్‌ సంస్థ కరోనా సహాయక చర్యల నిమిత్తం రూ.5కోట్లు సాయం ప్రకటించింది. ఈ మేరకు తమిళనాడు సీఎం సహాయ నిధికి రూ.3కోట్లు ఇవ్వగా.. రూ.2కోట్లతో హొసూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంటు, స్టాన్లీ వైద్య కళాశాలలో వెంటిలేటర్‌ పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను ఏర్పాటుచేస్తోంది. అలాగే, అమెరికాకు చెందిన ఓ సంస్థ కరోనా నివారణ చర్యల కోసం ఒడిశా సీఎం సహాయ నిధికి రూ.50లక్షలు విరాళంగా అందించింది. 

* బజాజ్‌ ఆటో సంస్థ తమ ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు ఉచితంగా టీకా అందిస్తోంది. దేశవ్యాప్తంగా దశల వారీగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆ సంస్థ ఇప్పటివరకు 45 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేయగా.. తాజాగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌ ప్రారంభించింది. అలాగే, కాంట్రాక్టు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను కూడా ఈ పరిధిలోకి తీసుకొచ్చింది. దాదాపు 20వేల మందికి టీకాలు అందించనుంది. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని