Corona: ఊరటనిచ్చే ‘పాజిటివ్‌’ న్యూస్‌! 

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి రోజురోజుకీ తగ్గుముఖం పడుతోంది. పాజిటివిటీ రేటు దిగొస్తుండగా.. రికవరీ రేటు పెరుగుతోంది. దీనికితోడు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ క్రమంగా పుంజుకోవడం.....

Updated : 07 Jun 2021 20:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. పాజిటివిటీ రేటు దిగొస్తుండగా.. రికవరీ రేటు పెరుగుతోంది. దీనికితోడు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ క్రమంగా పుంజుకోవడం ఊరటనిస్తోంది. మరోవైపు, ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. కరోనా కష్టకాలంలో ఉపశమనం కలిగించే ఇలాంటి మరికొన్ని వార్తలు మీకోసం.. 

* దేశంలో కరోనా కేసులు 61 రోజుల కనిష్ఠానికి చేరాయి. వరుసగా 25వ రోజూ కొత్త కేసుల కన్నా రికవరీ అయినవారి సంఖ్యే ఎక్కువగా కొనసాగింది. వరుసగా 14వ రోజూ రోజువారీ పాజిటివిటీ రేటు 10 శాతంకన్నా తక్కువగా (6.34శాతం) నమోదైంది. కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడంతో యాక్టివ్‌ కేసుల కొండ కరుగుతోంది. ప్రస్తుతం 14.01లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 36.6 కోట్ల మందికి పరీక్షలు చేశారు. దేశంలో రికవరీ రేటు 93.94 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.21శాతంగా ఉంది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు దేశ వ్యాప్తంగా 23.27 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు.

కరోనా ఆపత్కాలంలో పేదలను ఆదుకొనేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి గరీభ్‌ కళ్యాణ్‌ అన్న యోజన కార్యక్రమాన్ని మరోసారి పొడిగించారు. ఈ పథకం కింద ఇచ్చే ఉచిత రేషన్‌ను దీపావళి వరకు అమలు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ పథకం కింద కేంద్రం నిర్దేశించిన విధంగా ఆహార ధాన్యాలను ప్రజలకు ఉచితంగా అందించనున్నారు. దీని ద్వారా దాదాపు 80 కోట్ల మంది ప్రజలకు నవంబర్‌ వరకు ఉచితంగా ఆహారధాన్యాలు అందుతాయని మోదీ పేర్కొన్నారు. 

కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలను ఈ నెల 16వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. జూన్‌ 12,13 (శని, ఆది) తేదీల్లో మాత్రం పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ అమలు చేస్తామని సీఎంవో తెలిపింది.  అలాగే, పంజాబ్‌ ప్రబుత్వం కూడా కరోనా ఆంక్షలను జూన్‌ 15వరకు పొడిగించింది. సాయంత్రం 6గంటల వరకు దుకాణాలకు అనుమతివ్వడంతో పాటు ప్రైవేటు కార్యాలయాలు 50శాతం సామర్థ్యంతో పనిచేసేలా పలు సడలింపులను ఇచ్చింది.  రాత్రిపూట కర్ఫ్యూ మాత్రం రాత్రి 7గంటల నుంచి ఉదయం 6గంటల వరకు అమలులో ఉంటుందని, ఆదివారాల్లో మాత్రం రెగ్యులర్‌ కర్ఫ్యూ అమలు చేస్తామని పేర్కొంది. 

దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన అందరికీ జూన్‌ 21 (ప్రపంచ యోగా దినోత్సవం) నుంచి ఉచితంగా వ్యాక్సిన్‌ పంపిణీ చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. టీకాలకు రాష్ట్రాలు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదని, ఖర్చంతా కేంద్రమే భరిస్తుందని వెల్లడించారు. కంపెనీలు ఉత్పత్తి చేసిన దాంట్లో 75శాతం వ్యాక్సిన్‌ను కేంద్రమే సేకరించి రాష్ట్రాలకు ఇస్తుందని, 25శాతం ప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేసుకోవచ్చన్నారు.

ఏపీలో కొత్త కేసులు భారీగా తగ్గాయి. నిన్న 64,800 శాంపిల్స్‌ పరీక్షిస్తే.. 4,872 మందిలో కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. అలాగే, తాజాగా మరో 13,702 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,14,510 క్రియాశీల కేసులు ఉన్నాయి. మరోవైపు, ఏపీలో పగటి పూట కర్ఫ్యూని ఈ నెల 20 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 11 నుంచి సడలింపుల సమయాన్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి 2గంటల వరకు పెంచింది. 

నవంబర్‌ నాటికి దేశ వ్యాప్తంగా 80 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని ప్రధాని ప్రకటించారు. సొంత ఖర్చుతో టీకా వేసుకొనేవారికి ప్రైవేటు ఆస్పత్రుల్లో అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. గరిష్ఠంగా రూ.150 సర్వీస్‌ ఛార్జితో అక్కడ టీకా పొందవచ్చని మోదీ తెలిపారు. ఏడు కంపెనీలు టీకా తయారు చేస్తున్నాయని, మరో మూడు కంపెనీలు క్లినికల్‌ ట్రయల్‌ నిర్వహిస్తున్నట్టు ప్రధాని వెల్లడించారు. వ్యాక్సినేషన్‌లో మనం ఎవరికన్నా వెనుకబడి లేమని ప్రధాని స్పష్టంచేశారు.

టీకా పంపిణీ మరింత వేగవంతం చేసేందుకు దిల్లీలోని కేజ్రీవాల్‌ సర్కార్‌ సన్నాహాలు చేస్తోంది. ఓటు ఉన్న పోలింగ్‌ కేంద్రం వద్దకే వెళ్లి ప్రజలు టీకా వేయించుకొనేలా కార్యక్రమాన్ని ప్రారంభించింది. అలాగే, త్వరలోనే ఇంటి వద్దకే వ్యాక్సిన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని సీఎం కేజ్రీవాల్‌ వెల్లడించారు. వచ్చే నాలుగు వారాల్లోనే 65ఏళ్ల వయసు పైబడిన అందరికీ టీకా పంపిణీ పూర్తి చేస్తామన్నారు. దిల్లీలో కొత్త కేసులు భారీగా తగ్గిపోవడంతో ఈ రోజు నుంచే సడలింపులు అమలుచేస్తున్నారు. 

థర్డ్‌ వేవ్‌ ముప్పు ఉందంటూ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో చిన్నారుల కోసం 3కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్‌ ఆదేశించారు. విశాఖ, తిరుపతి, విజయవాడ-గుంటూరులలో ఒకచోట సిద్ధం చేయాలన్నారు. ఒక్కో కేర్‌ సెంటర్‌కు రూ.180కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. థర్డ్‌ వేవ్‌పై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పోషకాహార పంపిణీ, టీకాల కార్యక్రమాన్ని కొనసాగించాలని అధికారుల్ని ఆదేశించారు.

ఏపీలో కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ ఆర్థిక సాయం మంజూరు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున రూ.1.30కోట్ల నిధులు విడుదల చేశారు. విశాఖలో 13మంది పిల్లల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేసినట్టు కలెక్టర్‌ వెల్లడించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని