
Positivity Rate: ఆ 10 రాష్ట్రాల్లో 25%పైనే!
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఒక్కోచోట లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా.. 8 రాష్ట్రాల్లో 50వేల నుంచి లక్ష వరకూ ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అలాగే, పది రాష్ట్రాల్లో 25శాతానికి పైగా కరోనా పాజిటివిటీ రేటు ఉన్నట్టు తెలిపారు. మే 3 నుంచి దేశంలో రికవరీ రేటు పెరుగుదల నమోదవుతోందని చెప్పారు. కేరళ, తమిళనాడు, బెంగాల్‌లో భారీగా కొత్త కేసులు నమోదవుతున్నట్టు వెల్లడించారు.
గోవాలో పాజిటివిటీ రేటు 48.1%
దేశంలో 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా.. 8 రాష్ట్రాల్లో 50 నుంచి లక్ష వరకు; 15 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 50వేల కన్నా తక్కువ యాక్టివ్ కేసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. కర్ణాటకలో అత్యధికంగా క్రియాశీల కేసులు ఉండగా.. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, యూపీ, ఏపీ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హరియాణా రాష్ట్రాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక పాజిటివిటీ రేటు విషయానికి వస్తే.. గోవాలో కొవిడ్ పాజిటివిటీ రేటు 48.1శాతంగా ఉండగా.. పుదుచ్చేరిలో 42.5, పశ్చిమబెంగాల్‌లో 34.3శాతంగా ఉంది. దేశంలో 25శాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు 10 ఉండగా.. 15శాతం పాజిటివిటీ రేటు కలిగిన రాష్ట్రాలు 14 ఉన్నట్టు కేంద్రం తెలిపింది.
గత రెండు వారాలుగా కరోనా పరిస్థితిని పరిశీలిస్తే.. ఏప్రిల్ 22 నుంచి 28 వరకు 125 జిల్లాల్లో పాజిటివిటీ రేటు తగ్గగా.. మే 6 నుంచి 13 వరకు 338 జిల్లాల్లో తగ్గుదల నమోదైనట్టు కేంద్రం తెలిపింది. అలాగే, ఇప్పటివరకు 17.72కోట్ల డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. తొలి డోసును 13.76కోట్ల మందికి వేయగా.. రెండో డోసును 3.96కోట్ల మందికి వేసినట్టు తెలిపారు.
17Cr డోసులు: భారత్‌లో 114రోజులు; మరి చైనాలో?
17 కోట్ల డోసుల పంపిణీకి భారత్‌లో 114 రోజుల సమయం పట్టినట్టు కేంద్రం తెలిపింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దగ్గర వేగంగా టీకా పంపిణీ పంపిణీ జరుగుతోందని వెల్లడించింది. 17 కోట్ల మార్కును దాటేందుకు భారత్‌కు 114 రోజులు పట్టగా.. అమెరికాకు 115 రోజులు, చైనాకు 119 రోజుల సమయం పట్టిందని కేంద్రం వెల్లడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.